సాక్షి, చైన్నె: తమిళనాడులో విద్యుత్ మీటర్ల రీడింగ్ అకౌంటింగ్ పనులను కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న విద్యుత్ బోర్డు నిర్ణయంపై తీవ్ర దుమారం బయలు దేరింది. కార్మిక సంఘాలతో పాటు పీఎంకే నేత అన్బుమణి రామదాస్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వివరాలు.. తమిళనాడులో విద్యుత్ బోర్డు పరిధిలో వేలాది అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకు, 7,590 అకౌంటెంట్ పోస్టులకు గాను దాదాపు 73% (5,602) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సరైన సమయంలో విద్యుత్‌మీటర్ల రీడింగ్ లెక్కించకపోవడం వల్లే వినియోగదారులకు అధిక విద్యుత్ బిల్లుల సమస్య వస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు, రానన్న 6 నెలల పాటు ప్రైవేట్ కంపెనీల ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో అకౌంటెంట్లను నియమించాలని విద్యుత్ బోర్డు రెవెన్యూ విభాగం ప్రాంతీయ ఇంజనీర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
సామాజిక న్యాయానికి విరుద్ధం
కాంట్రాక్ట్ నియామకాలలో రిజర్వేషన్లు వర్తించవని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల యువత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని పీఎంకే నేత అన్బుమణి ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తే వేలాది మందికి సామాజిక న్యాయం జరిగేదని తెలిపారు. శాశ్వత ఉద్యోగులతో పోలిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు చాలా తక్కువ వేతనం ఇస్తారని, మధ్యలో ప్రైవేట్ ఏజెన్సీలు లాభాలు పొందుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు బాధ్యత ఉండదని, దీనివల్ల అధిక విద్యుత్ బిల్లుల సమస్య మరింత పెరుగుతుందే కానీ తగ్గదని హెచ్చరించారు.
కార్మిక సంఘాల వ్యతిరేకత
విద్యుత్ ఉద్యోగుల కేంద్ర కమిటీ అధ్యక్షుడు కన్నన్ కూడా కాంట్రాక్ట్ నియామకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కేవలం తాత్కాలికంగా 6 నెలలంటూ ప్రైవేట్ కాంట్రాక్టులకు వెళ్లకుండా, తక్షణమే ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను శాశ్వత ఉద్యోగులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఇలాంటి ప్రైవేట్ కాంట్రాక్ట్ విధానాలను పునర్ పరిశీలించాలని కోరారు.


