వేలూరు: తమిళ పురటాసి మాస రెండవ శనివారాన్ని పురష్కరించుకొని స్వామి వారి ఆలయాల్లో భక్తులు కిటకిట లాడారు. రెండవ శనివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపవాసంతో మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో భక్తులతో కిటకిట లాడింది. వేలూరులోని తిరుమల తిరుపతి దేవస్థాన సమాచార మందిరంలో ఉదయం స్వామి వారికి విశేష పూజలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. వేలపాడిలోని వరదరాజ పెరుమాల్ ఆలయం, అరసంబట్టు పెరుమాల్ ఆలయం, బ్రహ్మపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోను భక్తులతో కిటకిటలాడింది. వాలాజలోని శ్రీ దన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీనివాస పెరుమాల్‌కు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. వేలూరు జిల్లాతో పాటు తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిట లాడింది. అనేక ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. వేలూరు వేలపాడిలోని పెరుమాల్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా శంకరన్‌పాళ్యంకు చెందిన అరుల్ వాసగి కుటుంబ సభ్యులచే భక్తులకు ప్రత్యేక అన్నదానం చేశారు.
శ్రీవారికి ప్రత్యేక పూజలు
కొరుక్కుపేట: చైన్నై షావుకారుపేట కుమరప్ప మేసీ్త్ర వీధిలో పెరటాసి రెండో శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమాజం ఆధ్వర్యంలో కలియుగదైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను వైభవోపేతంగా నిర్వహించారు. సమాజం 5వ వార్షిక పెరటాసి రెండో శనివారం వేడుకలు సందర్బంగా కుమరప్ప మేసీ్త్రవీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వివిధ రకాల పుష్పాలతో, పండ్లతో ,అరటి మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పురోహితులు వడ్డి వెంకటేశ్వర్లు గణపతి పూజతో వేడుకలను ప్రారంభించి అనంతరం శ్రీవారికి అర్చణ ,అలంకారం , హారతి , ప్రసాద నివేదనతో శాస్త్రోక్తంగా పూజలు చేసి భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులను అందించారు . ఈ సందర్భంగా సమాజం నిర్వాహకులు మాట్లాడుతూ కుమరప్ప మేసీ్త్ర వీధిలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న తెలుగు వారంతా కలసి ఐక్యమత్యంతో ఏటా పెరటాసి శనివారం పూజలను ఎంతో ఆనందంగా, భక్తితో జరుపుకుంటున్నట్టు తెలిపారు. సమాజం ఉత్సవ కమిటీకి చెందిన ఆకుల ఆదినారాయణ, పి.మురళి,చంద్రశేఖర్, సర్వేపల్లి మల్లిఖార్జున్, జి అనిల్, కె. రవి, బి సోమశేఖర్, టిజి రమేష్, ఎం సుబ్రమణ్యం, ఏ దామోధర్, ఎన్ సుబ్రమణ్యం, పి సతీష్ , జి. శ్రీనివాసులు, ఏ.చరణ్ పాల్గొన్నారు. అనంతరం 2 వేలమందికి పైగా పేదలకు అన్నదానం చేశారు.
టీటీడీ ఆలయంలో: చైన్నె టి.నగర్‌లోని టీడీడీ ఆలయంలో పెరటాసి రెండో శనివారం పూజలను విశేషంగా నిర్వహించారు. సన్నిధి అలంకారంలో శ్రీదేవిభూదేవి సమేత శ్రీవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగం కల్పించారు.


