తమిళసినిమా: నటుడు రజనీకాంత్ వారసురాలిద్దరూ సినీ రంగంలోనే తమ ప్రతిభను చాటుకుంటున్న విషయం తెలిసిందే. వారిలో చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకురాలుగా, నిర్మాతగా బాధ్యతలను నిర్వహిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నారు. అలా ఈమె తాజాగా షో రన్నర్‌గా, నిర్మాతగా బాధ్యతలను నిర్వహించిన వెబ్ సిరీస్ లవ్. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు అర్జున్ దాస్, నటి ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్‌లుగా నటించారు. ఈ డిజిటల్ కాలంలో యువత ప్రేమ , డేటింగ్, అనుభవాలు, భావోద్రేకాలను సరికొత్తగా ఆవిష్కరించిన ఇది నెట్ ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ అన్నది గమనార్హం. కాగా లవ్ వెబ్ సిరీస్ అక్టోబర్ 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు అర్జున్ దాస్, నటి ఐశ్వర్య లక్ష్మి, దర్శకుడు బాలాజీ మోహన్, సౌందర్య రజినీకాంత్, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధి మోనికా శ్రీవాత్సవ్ పాల్గొన్నారు. సౌందర్య రజినీకాంత్ మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి ఈ కథను అందించిన నెట్ ఫ్లిక్స్ సంస్థకు ముఖ్యంగా మోనికా శ్రీవాత్సవ్ కు ధన్యవాదాలు. ముంబాయిలో లవ్ కథా చర్చల్లో పాల్గొన్న సమయంలో మోనికతో ఉన్న అనుభవం నాకు చాలా ప్రత్యేకం. మంచి నిర్మాతగా, మంచి కథా టెల్లర్‌గా రూపొందించడంలో ఆమె చూపించిన ఉద్వేగం మర్చిపోలేను. నేను చాలా విషయాల గురించి ఎక్కువగా ఆశ్చర్యం చెందను. ఎందుకంటే నేను తలైవర్ (రజనీకాంత్) కూతురిని కావడమే. అందరూ ఆరాధించే వ్యక్తితో కలిసి ఉండటంతో ఇతరులను చూసి ఆశ్చర్యపడే అలవాటు తక్కువ. అలాంటిది మోనికా నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ కు షో రన్నర్ గా, నిర్మాతగా నిర్వహించడం పెద్ద బాధ్యత. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోవడం నేర్చుకున్నాను’’ అని సౌందర్య రజినీకాంత్ పేర్కొన్నారు.
చిత్రంలో
కోమలి ప్రసాద్
సౌందర్య రజనీకాంత్, మోనికా, అర్జున్‌దాస్, ఐశ్వర్య లక్ష్మి, బాలాజీ మోహన్


