క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన నోట్లో మట్టి కుక్కి హత్య ● మెకానిక్‌ అరెస్టు మేటూరు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ బాయిలర్‌ పైపులో లీకేజీ ● 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత బాల్య వివాహాలను అరికడుదాం.. ● డాక్టర్‌ సీఎన్‌ఎన్‌ రాజు పిలుపు శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరువొత్తియూరు: తమిళనాడు అంగన్‌వాడీ ఉద్యోగులు, సహాయకుల సంఘం తరపున, వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉత్తిరమేరూరు శిశు అభివృద్ధి ప్రాజెక్టు కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం మండల స్థాయి నిరసన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్‌వాడీ ఉద్యోగుల ,సహాయకుల సంఘం అధ్యక్షురాలు సూర్యప్రభ నాయకత్వం వహించారు. కోశాధికారి గుణబాయ్‌ సమక్షంలో ఈ నిరసన జరిగింది. కాగా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అంగన్‌వాడీ సిబ్బంది నినాదాలు చేశారు. కనీస ప్రాథమిక వేతనం రూ.18,000 ఇవ్వాలని కోరారు. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సిబ్బందికి పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీటితో పాటు ప్రతి శనివారం అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని కోరారు.

అన్నానగర్‌: ఆవడి సమీపంలోని కన్నపాలయం సరస్సు ప్రాంతంలో నోటిలో ఇసుక కుక్కిన స్థితిలో ఒక యువకుడి మృతదేహం పడి ఉందని 21వ తేదీన ఆవడి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం నోటిలో ఇసుక కుక్కి ఉండటాన్ని గమనించారు. అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం చైన్నెలోని కిల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. దర్యాప్తులో మృతుడు ఆవడి సమీపంలోని కన్నప్పపాలయం, ఒత్తవడై వీధికి చెందిన టేలర్‌ వసంత కుమార్‌ (47)గా గుర్తించారు. ఈ కేసులో శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన మదన్‌ (30) అనే బైకు మెకానిక్‌ ను అరెస్టు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో 20వ తేదీ రాత్రి కన్నప్పపాలయం చెరువు వద్ద వసంతకుమార్‌, మదన్‌ మద్యం సేవించారు. మత్తు ఎక్కువవ్వడంతో గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు. కొంతసేపటికి, మత్తులో ఉన్న వసంతకుమార్‌ కింద పడిపోయాడు. ఆ సమయంలో, బాగా మద్యం సేవించి ఉన్న మదన్‌, ఇసుకను తీసుకుని వసంతకుమార్‌ నోటిలో కుక్కాడు. ఆ తర్వాత మదన్‌ ఇంటికి వెళ్లిపోయాడు. నోరంతా ఇసుకతో నిండి ఉండటంతో వసంతకుమార్‌కు ఊపిరాడలేదు. ఊపిరాడక అతను మరణించి ఉండవచ్చని వారు తెలిపారు.

తిరువొత్తియూరు: సేలం సమీపంలోని మేటూరులో ఉన్న 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ బాయిలర్‌ పైపులో లీకేజీ ఏర్పడింది. ఈ కారణంగా ఆ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు.దీనివల్ల విద్యుత్‌ ఉత్పత్తిలో 210 మెగావాట్ల కొరత ఏర్పడింది. మేటూరులో మొదటి దశ కింద 210 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నాలుగు థర్మల్‌ పవర్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత, 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరొక థర్మల్‌ యూనిట్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు దశలను కలిపి, మేటూరులో మొత్తం 1,400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇందులో మొదటి దశకు చెందిన ఒక 210 మెగావాట్ల థర్మల్‌ యూనిట్‌ లోనే ప్రస్తుతం ఈ లీకేజీ జరిగింది. అధిక వేడి, నిరంతర పని ఒత్తిడి (లోడ్‌) కారణంగానే ఈ లీకేజీ ఏర్పడిందని మేటూరు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు.

కొరుక్కుపేట: బాల్య వివాహాలు, బాలకార్మికులు, బాలల అక్రమ రవాణాను నివారించటం లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సర్వీస్‌ సివిల్‌ ఇంటర్నేషనల్‌ (ఎస్‌సీఐ) ఇండియా చైన్నె అధ్యక్షులు డాక్టర్‌ సీఎన్‌ఎస్‌ రాజు పిలుపునిచ్చారు. ఈమేరకు ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఐసిడబ్ల్యూవో ) ప్రధాన కార్యాలయం వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడబ్ల్యూవో కార్యదర్శి ఏజే హరిహరన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా బాల్య వివాహాలు, బాలల అక్రమరవాణాపై అవగాహన పెంచే పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సర్వీస్‌ సవిల్‌ ఇంటరేషనల్‌ (ఎస్‌సీఐ) బెల్లియంలోని ఆంట్‌ వేర్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఐక్యరాజ్యసమితి సంస్థలో సలహా హోదాలో ఉందన్నారు. ఈ సంస్థ అన్ని వయసుల, నేపద్యాల ప్రల కోసం అంత్జాతీ య స్వచ్ఛంద సేవా ప్రాజెక్టుల ద్వారా శాంతి సంస్కృతిని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement