ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్స్ ఏర్పాటు
సాక్షి, చైన్నె: రైలు, రోడ్డు ప్రయాణికుల భద్రతను పెంపొందించడంతో పాటు రాకపోకలను మరింత సులభతరం చేసే దిశగా దక్షిణ రైల్వే పరిధిలోని చైన్నె డివిజన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రైల్వే లెక్స్ క్రాసింగ్ గేట్లను ఆధునిక సాంకేతికతతో మారుస్తూ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ లిఫ్టింగ్ బారియర్స్ వ్యవస్థను వేగవంతం చేసింది. సాంప్రదాయ పద్ధతిలో చేత్తో తిప్పే మ్యాన్యువల్ గేట్లకు బదులుగా అత్యాధునిక ఎలక్ట్రిక్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఒక్కో యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ. 30 లక్షలు వెచ్చిస్తున్నారు.
70 గేట్లు పూర్తి..
చైన్నె డివిజన్ పరిధిలోని మొత్తం 143 మ్యాన్యువల్ లెవెల్ క్రాసింగ్ గేట్లలో ఇప్పటివరకు 70 గేట్లను విజయవంతంగా ఆధునికీకరించారు. చైన్నె బీచ్ – చెంగల్పట్టు సెక్షన్‌లోని మొత్తం 13 ఎల్సీ గేట్లలోనూ వంద శాతం ఈ ఆధునిక ఈఓఎల్‌బీ వ్యవస్థను ఏర్పాటు చేసి డివిజన్‌లోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ఎలక్ట్రిక్ గేట్ల వల్ల ప్రయోజనాలు
పాత పద్ధతిలో గేట్ తెరవాలన్నా, మూయాలన్నా గేట్‌కీపర్ చేత్తో వించ్ తిప్పడానికి దాదాపు 2 నుండి 3 నిమిషాల సమయం పట్టేది. దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడటంతో పాటు కొన్నిసార్లు గేట్లు దెబ్బతినేవి. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ గేట్లు కేవలం 8 నుండి 12 సెకన్లలోనే మూసుకుంటాయి లేదా తెరుచుకుంటాయి. వేగవంతమైన ఆపరేషన్ వల్ల రోడ్డు రద్దీ తగ్గి, ప్రయాణికుల వెయిటింగ్ టైమ్ గణనీయంగా తగ్గుతుంది. అలాగే రైళ్లు ఆలస్యం కావడాన్ని కూడా నివారించవచ్చు. రైల్వే గేట్ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు, డివిజన్‌లోని 143 ఎల్సీ గేట్లలో 133 చోట్ల ఎమర్జెన్సీ స్లైడింగ్ బూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ వాహనాల వల్ల గేట్లు దెబ్బ తిన్నా, ఈ ఎమర్జెన్సీ బూమ్‌లను ఉపయోగించి రైళ్లు సురక్షితంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయవచ్చు. మిగిలిన లెక్స్ క్రాసింగ్ గేట్లను కూడా దశలవారీగా ఈ ఆధునిక ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చడంతో పాటు, సబ్‌వేలు , రోడ్ ఓవర్ బ్రిడ్జీలు , రోడ్ అండర్ బ్రిడ్జీల నిర్మాణాలను కూడా వేగవంతం చేస్తున్నట్లు చైన్నె డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.


