సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల ఖర్చుల వివరాలు వెలువడ్డాయి. ఇందులో అత్యల్పంగా టీవీకే రూ. 19.8 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టి ఉండటం విశేషం. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అధికార డీఎంకే ఓటమి చవి చూసింది. ప్రధాన ప్రతి పక్షంగా సర్దుకోవాల్సి వచ్చింది. ఇక, అన్నాడీఎంకే మూడో స్థానంకు పరిమితమైంది. అయితే, పార్టీ ఏర్పాటు చేసిన మూడేళ్ల కాలంలో సరికొత్తచరిత్రను సృష్టించి విజయ్ నేతృత్వంలోని టీవీకే అత్యధిక స్థానాలు కై వశం చేసుకుంది. తమిళనాడులో ఇదో చరిత్ర అయితే. మరో చరిత్ర తొలి సారిగా రాష్ట్రంలో టీవీకే చీఫ్ విజయ్ సీఎంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికలలో 234 స్థానాలలోనూ టీవీకే ఒంటరిగా పోటీ చేసింది. అయితే,ఎన్నికలకు వారు పెట్టిన ఖర్చులు మరీ తక్కువే. ఆ మేరకు తాజాగా ఎన్నికల కమిషన్‌కు ప్రధాన పార్టీలు సమర్పించిన ఖర్చులకు సంబంధించిన గణాంకాలు వెలువడ్డాయి. ఇందులో టీవీకే కేవలం 19.8 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టడం గమనార్హం. ఇక, టీవీకేతో పోల్చితే స్టాన్ నేతృత్వంలోని డీఎంకే పదిరెట్లు ఎక్కువగా రూ. 197.84 కోట్లు ఖర్చు పెట్టి ఉండటం గమనార్హం. ఇక, పళణిస్వామినేతృత్వంలోని అన్నాడీఎంకే రూ. 112.39 కోట్లు ఖర్చు పెట్టింది. సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి రాష్ట్రంలో 234 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసి కేవలం రూ. 1.37 కోట్లు ఖర్చు పెట్టడం మరో విశేషం.
టీవీకే ఖర్చుల వివరాలు.
ఎన్నికల ప్రకటన సమయంలోటీవీకే పార్టీ వద్ద ప్రారంభ నిల్వ రూ.3.03 కోట్లు ఉండగా, ఎన్నికల సమయంలో వివిధ మార్గాల ద్వారా రూ.7.02 కోట్లు సమకూరాయి. రూ.6.34 కోట్లు వార్తాపత్రికలు, డిజిటల్ మీడియా రేడియో ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేశారు. పార్టీ అధినేత విజయ్ విమాన ప్రయాణాల కోసం రూ.3.54 కోట్లు వెచ్చించారు. బహిరంగ సభలు – రోడ్ షోలకు రూ. 2.06 కోట్లు, ప్రచార సామాగ్రికి రూ. 40.54 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో టీవీకే సోషల్ మీడియా ఆన్‌లైన్ ప్రచారం కోసం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు వెచ్చించకపోవడం విశేషం. నామ్ తమిళర్ కట్చి ఎన్నికల కోసం రూ. 2.20 కోట్లు వివిధ వనరుల ద్వారా సేకరించగా, అభ్యర్థులకు రూ.44 లక్షలు అందించగా ప్రచారం కోసం మొత్తం రూ. 93 లక్షలు ఖర్చు చేసింది. ఎన్నికల ముగింపునకు పార్టీ వద్ద ఇంకా రూ. 64 లక్షలు మిగలడం విశేషం.


