ప్రవీణ్‌ కూటమి అలజడి | - | Sakshi
Sakshi News home page

ప్రవీణ్‌ కూటమి అలజడి

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

● కూటమికి కొత్త పేరులో వివాదం ● ఇందులో తాము లేదన్న వామపక్షాలు ● నామినేషన్‌ దాఖలుతో రెండు పార్టీల వద్దకు పరుగులు

సాక్షి, చైన్నె : రాజ్యసభ పదవి దక్కబోతున్న ఆనందంలో కాంగ్రెస్‌ నాయకుడు ప్రవీణ్‌ చక్రవర్తి సోషల్‌ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన తమిళనాట రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. తమిళనాడు సామాజిక న్యాయ ప్రగతిశీల కూటమి( తమిళనాడు సోషియల్‌ జస్టిస్‌ ప్రోగ్రెసీవ అలయన్స్‌) పేరుతో ఒక సరికొత్త కూటమి ఏర్పడిందని, అందులో లెఫ్ట్‌ పార్టీలు కూడా భాగస్వామ్యంగా ఉన్నాయని ఆయన పేర్కొనడం ఈ వివాదానికి కారణమైంది. దీనిని కమ్యూనిస్ట్‌ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.

వివాదాస్పద పోస్టు

తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికై న ప్రవీణ్‌ చక్రవర్తి ఆనందంతో ఎక్స్‌ పేజీలో ఓ ట్వీట్‌ చేశారు. తమిళనాడులో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ కూటమికి ఆయన ఓ పేరు కూడా పెట్టేశారు. టీవీకే, కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌, సీపీఐ, సీపీఎం భాగస్వామ్యంతో కూడిన ‘తమిళనాడు సామాజిక న్యాయ ప్రగతిశీల కూటమి’ మొదటి ఎంపీ అభ్యర్థిగా ఎంపికవడం గర్వంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. నాపై నమ్మకం ఉంచిన రాహుల్‌గాంధీ, సీఎం విజయ్‌లకు ధన్యవాదాలు అంటూ ప్రవీణ్‌ చక్రవర్తి చేసిన ఈ పోస్టును వామపక్షాలు తీవ్రంగానే పరిగణించాయి

ఆయనకు అతి తెలివి ఎక్కువ: సీపీఎం ఆగ్రహం

ప్రవీణ్‌ చక్రవర్తి పోస్ట్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఎక్స్‌ వేదికగానే అత్యంత ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. కొత్త కూటమి తరఫున తాను రాజ్యసభ అభ్యర్థిగా నిలబడ్డానని, ఇందులో సీపీఎం కూడా ఉందని చెప్పడం పచ్చి అబద్ధం అని మండిపడ్డారు. ఇలాంటి కూటమి ఏర్పాటుపై గానీ, ఈ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై గానీ తమను ఎవరూ సంప్రదించలేదని వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రవీణ్‌ చక్రవర్తి పెట్టిన ఈ పోస్ట్‌ను అతి తెలివి ప్రదర్శించడంతో సమానం అని మండిపడ్డారు.

కూటమి గురించి మాకేం తెలియదు: సీపీఐ

మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీర పాండియన్‌ సైతం తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్‌ చక్రవర్తి ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్‌ చక్రవర్తి పేర్కొన్న సామాజిక న్యాయ ప్రగతిశీల కూటమిలో తాము లేమని, అసలు అలాంటి కూటమి ఒకటుందనే విషయమే సీపీఐకి తెలియదని ఆయన తేల్చి చెప్పారు.టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తాము మద్దతు ఇచ్చింది వాస్తవేమన్నారు. అయితే, అది కేవలం తమిళనాడులో గవర్నర్‌ పాలన రాకూడదని, కేంద్రంలోని బీజేపీ పరోక్షంగా ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోమాత్రమేనన్నారు. అంతేకానీ, కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి కాదని వీరపాండ్యన్‌ స్పష్టం చేశారు.

రెండు పార్టీల వద్దకు పరుగులు

కూటమి పేరు రచ్చకెక్కిన నేపథ్యంలో సీఎం విజయ్‌ సమక్షంలో అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి తేన్‌మొళికి నామినేషన్‌ను ప్రవీణ్‌ చక్రవర్తి సమర్పించారు. అనంతరం తమ పార్టీకి చెందిన మంత్రులు విశ్వనాథన్‌, రాజేష్‌కుమార్‌తో పాటుగా ముఖ్యనేతలతో కలిసి సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు ప్రవీణ్‌ చక్రవర్తి వెళ్లారు. రాజ్యసభ ఎన్నికలలో తనను ఆదరించాలని విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement