అస్తమించిన పోరాట యోధుడు
కమ్యూనిస్టుల్లో విషాదం ఆస్పత్రికే పార్తీవ దేహం అప్పగింత పార్టీలకు అతీతంగా నేతల నివాళి
జీవితాంతం పోరాటాల ప్రయాణం సాగించిన సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను (101) ఇక సెలవు అంటూ దివి కేగారు. రాజీవ్ గాంధీ జీహెచ్‌లో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ సమాచారంతో కమ్యూనిస్టులలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీలకు అతీతంగా నేతలందరూ తరలి వచ్చి ఆయన పార్తీవ దేహానికి అంజలి ఘటించారు. ఆయన భౌతిక కాయాన్ని జీహెచ్ ఆస్పత్రి విద్యార్థుల పరిశోధనల కోసం అప్పగించారు.
సాక్షి, చైన్నె: సీపీఐలో అత్యంత సీనియర్ నేతగా నల్లకన్ను తమిళనాట సుపరిచితుడు. నిజాయితీకి ప్రతి రూపం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినా, గళం విప్పినా అది ఆయనకే సొంతం. కనీసం సొంత ఇళ్లు కూడా ఆయనకు లేదు. ప్రభుత్వ గృహంలో ఉన్నా, క్రమం తప్పకుండా అద్దె చెల్లించే వారు. వందళ్ల వయస్సులో సైతం కుర్రోడ్ని అన్నట్టుగా చలాకీగా ముందుకు సాగే నల్లకన్ను రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత కావడం గమనార్హం.
సంగ్రామం నుంచి కమ్యూనిస్టు యోధుడిగా
నాటి తిరునల్వేలి, నేటి తూత్తుకుడి జిల్లా పరిధిలోని శ్రీ వైకుంఠంలో 1925 డిసెంబరు 26వ తేదిన సంపన్న వ్యవసాయ కుటుంబంలో రామసామి, కరుప్పాయి దంపతుల మూడవ సంతానంగా నల్లకన్ను జన్మించారు. పాఠశాల రోజుల్లో దేశం గురించి, స్వాతంత్య్ర పోరాటం గురించి అవగాహన పెంచుకుని యువకులను ఏకం చేసి పోరాటాల బాట పట్టారు. సమరయోధుడిగా స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన చేసిన పోరాటాలతో చివరకు కమ్యూనిస్ట్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ సమయంలో తిరునల్వేలిలో ఓ కేసులో ఆయన్ను చిత్ర హింసలకు గురి చేశారు. ఆ తదుపరి అణగారిన వర్గాల అభ్యున్నతి, రైతుసంక్షేమమే పరమావధిగా, అంటరాని తనం నిర్మూలనే లక్ష్యంగా దక్షిణ తమిళనాడులో తీవ్ర పోరాటాలతో ముందడుగు వేశారు. తమిళనాడు వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా 25 సంవత్సరాలు పని చేసి కార్మికవర్గ హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ప్రారంభమైన రాజకీయ పయనంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. పార్టీ కేంద్ర నియంత్రణ కమిటీ అధ్యక్షుడు, జాతీయ కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు వంటి ఉన్నత పదవులలో గొప్ప సేవలందించారు. దివంగత నేతలు పెరియార్, అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలితల నుంచి నేటీ సీఎం స్టాలిన్ వరకు అందరితోనూ ఆయన ఎంతో ఆప్యాయంగా మెలిగేశారు. అందుకే ఆయన అంటే కమ్యూనిస్టులకే కాదు, ద్రవిడ పార్టీలకు, కాంగ్రెస్ తదితర పార్టీలకు గౌరవం, మర్యాద. తమిళనాడు రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నేతగా ఉంటూ వచ్చిన ఆయన తాజాగా దివికేగారు.
ప్రజల సందర్శనకు పార్తీవ దేహం
గత ఏడాది డిసెంబరు 26వ తేదీన 101 వసంతంలోకి నల్లకన్ను అడుగు పెట్టారు. గత ఏడాది ఆగస్టులో ఇంటిలో ఆయన జారి పడ్డప్పటి నుంచి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో తరచూ రాజీవ్ గాంధీ జీహెచ్‌లో అడ్మిట్ అవుతూ వచ్చారు. తాజాగా కూడా మూడు వారాలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన నల్లకన్ను బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు కన్నుమూశారు. ప్రజా జీవితంలో స్వచ్ఛత, సరళత, నిజాయితీ నిస్వార్థతకు సజీవ చిహ్నంగా నిలిచిన ఆయన తమిళనాడు ప్రజల నుంచి విశేష గౌరవ మర్యాదలు అందుకున్నారు. ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి. అవార్డులతో తనకు వచ్చే కానుకను ప్రభుత్వానికి, పార్టీకి ఇచ్చిన ఘనత ఆయనకే సొంతం. మతతత్వ, దురహంకార శక్తులకు వ్యతిరేకంగా ఆయన రాజీలేని పోరాటం చేసి తాజాగా శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లారు. ఆయన పార్తీవ దేహానికి ఎంబామింగ్ చేశారు. సాయంత్రం 5 గంటలకు జీహెచ్ నుంచి ఊరేగింపుగా పల్లవన్ ఇల్లం, సిమ్సన్, అరివాలయం, తేనాం పేట మీదుగా టీ నగర్‌లోని సీపీఐ కార్యాలయానికి తరలించారు. దారి పొడవున వామపక్ష కేడర్ పార్టీ జెండాలతో ఆయనకు అంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు టీ నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో ఉంచుతారు. ఆ తర్వాత ఆయన పార్తీవ దేహాన్ని చైన్నె మెడికల్ కాలేజీ ఆసుపత్రికి అందజేయనున్నారు. నల్లకన్ను మృతికి సీపీఐ ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పార్టీ జెండాలను అవనతం చేశారు. కాగా కామేడ్ర్ నల్లకన్ను సతీమణి రంజితం పదేళ్ల క్రితం మరణించారు. ఈ దంపతులకు ఎన్.కాశీభారతి, డాక్టర్ ఎన్.ఆండాల్ కుమార్తెలు ఉన్నారు.
నల్లకన్ను పార్థీవ దేహానికి కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్, నైనార్ నాగేంద్రన్ నివాళి
దిగ్గజ రాజకీయ నేత నల్లకన్ను కన్నుమూత
ఘన నివాళులు..
నల్లకన్ను మరణ సమాచారంతో సీపీఐ నేతలు వీర పాండియన్, ముత్తరసన్, సీపీఎం నేతలు షణ్ముగం, సంపత్, రామకృష్ణన్ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా సైతం చైన్నెకు చేరుకున్నారు. ఆయన పార్తీవ దేహానికి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, వీసీకే నేత తిరుమావళవన్‌లు ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పించారు. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, వీసీకే కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, అన్నాడీఎంకే పళణి స్వామి, ఎండీఎంకే నేత వైగో తదితర నేతలతో పాటూ సినీ నటుడు రజనీకాంత్, టీవీకే నేత విజయ్ తదితరులు సైతం తమ సంతాపం తెలియజేస్తూ ప్రకటనలు విడుదల చేశారు. టీ నగర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు తరలి వచ్చి నల్లకన్ను పార్తీవ దేహానికి అంజలి ఘటిస్తూ, ఆయన పోరాటాలు, త్యాగాలు, సేవలను స్మరించుకుంటున్నారు.
అస్తమించిన పోరాట యోధుడు
అస్తమించిన పోరాట యోధుడు
అస్తమించిన పోరాట యోధుడు


