విద్వేషం...విభజన ప్రయత్నాలు వద్దు
సాక్షి, చైన్నె: తమిళనాట రెచ్చగొట్టి ద్వేష పూరిత వాతావరణం సృష్టించడం, విభజన ప్రయత్నాలు చేయడం మానుకోండి అని కేంద్రంలోని బీజీపీ పాలకులను సీఎం స్టాలిన్ హెచ్చరించారు. డీఎంకే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రధాని మోదీ పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, కొత్త ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలకు భారీ ప్రాధాన్యం ఇస్తూ మొత్తం రూ.1,785 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు పనులను ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రూ.632 కోట్ల 35 లక్షల 77 వేల వ్యయంతో పూర్తయిన 1,217 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా రూ.294 కోట్ల 9 లక్షల అంచనా వ్యయంతో 1,237 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వివిధ శాఖల ద్వారా 3,12,082 మంది లబ్ధిదారులకు రూ.858 కోట్ల 92 లక్షల విలువైన సంక్షేమ సహాయాన్ని అందజేశారు. వీటిలో తాగునీటి పథకాలు, ఆధునిక మార్కెట్లు, కొత్త బస్ స్టాండ్లు, రోడ్డు అభివృద్ధి పనులు, నాగర్‌కోయిల్‌లో ఆధునిక సమగ్ర బస్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పలు పట్టణ పంచాయతీల్లో రహదారులు, పార్కులు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి పనులు ఉన్నాయి.
కొత్త ప్రకటనలు
ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ కన్యాకుమారి విశిష్టతలను గుర్తు చేశారు. తిరువళ్లువర్ విగ్రహం, వివేకానంద రాక్‌ను గురించి ప్రస్తావిస్తూ 2026లో ద్రవిడ మోడల్ 2.ఓ ప్రభుత్వం ఏర్పడటానికి ముందుగా ప్రభుత్వ కార్యక్రమానికి ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఇక్కడ చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులు, పనుల గురించి ప్రకటన చేశారు. కన్యాకుమారి తాగునీటి అవసరాలను తీర్చడానికి రూ. 28 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు అమలు చేయనున్నామన్నారు. మూడు సముద్రాలు కలిసే ఈ ప్రాంతానికి రూ. 25 కోట్లు ఖర్చుతో మురికినీటి శుద్దీకరణ కేంద్రం సైతం నిర్మించనున్నామన్నారు. కులాచల్, మండైకాడు పరిసరాలలోని ప్రజల దీర్గ కాలిక డిమాండ్‌గా ఉన్న ఏవీఎం కాలువను రూ.1.20 కోట్లతో పునరుద్దరించనున్నామని తెలిపారు. కలియకవిలై – కన్యాకుమారి రహదారిని రూ. 9 కోట్లతో విస్తరించనున్నామని, కల్కుళం సర్కిల్ – ములకుముట్ కొలువై ఉన్న మరియన్ బసిలికా చర్చిని పురాతనతను చెక్కు చెదరకుండా పునరుద్దరించ నున్నామన్నారు.
నిరంతరం శ్రమిస్తున్నాం
తానే కాదు, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు తమిళ ప్రజల సంక్షేమార్థం నిరంతరం శ్రమిస్తున్నారని వివరించారు. ఎన్నికల సమయంలో మాత్రమే తాము ప్రజల వద్దకు రావడం లేదని, నిరంతరం ప్రజలలోనే ఉంటున్నామన్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో కనిపించడం తమిళనాట విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, విభజన మాటలతో కుట్రలు చేయడం పరిపాటిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడును విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. వివిధ రాష్ట్రాలలో మెట్రో పనులకు ఆమెదం ఇస్తున్న ప్రధాని, తమిళనాడు విషయానికి వస్తే నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారని మండి పడ్డారు. తమిళనాడును తమిళుడే పరిపాలించాలే గానీ, ఢిల్లీలో కూర్చున్న వాళ్లు కాదన్నారు. కుమారి జిల్లా అన్ని మతాల ప్రజలు నివసించే ప్రదేశం అని గుర్తు చేస్తూ, ఇక్కడ ప్రజలు సామరస్యంగా జీవించగలుగుతున్నారని, అయితే, దేశంలోని ఇతర జిల్లాలో ఉన్న పరిస్థితులను ఓ మారు ప్రజలు గుర్తెరగాలని సూచించారు. బీజేపీ వర్గాలు కేవలం ద్వేషాన్ని రగిలిస్తున్నారని, మత సామరస్యంకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోదరీమణులు, తల్లులకు రూ. 5,000 ముందస్తు నగదు తాను అందించానని, తాము చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్‌తో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
విద్వేషం...విభజన ప్రయత్నాలు వద్దు


