ఆ రోజు ఏం జరిగింది? | - | Sakshi
Sakshi News home page

ఆ రోజు ఏం జరిగింది?

Feb 25 2026 9:37 AM | Updated on Feb 25 2026 9:37 AM

ఆ రోజు ఏం జరిగింది?

ఆ రోజు ఏం జరిగింది?

తమిళనాడు ఎస్టీ మహిళపై లైంగికదాడి ఆరోపణలు 2023లో మహిళ ఫిర్యాదుతో పూతలపట్టు పోలీసులపై కేసు చిత్తూరులో విచారణ చేపట్టిన జాతీయ మానవహక్కుల కమిషన్‌ హాజరైన కలెక్టర్‌, ఎస్పీ పలువురిని విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

చిత్తూరు అర్బన్‌: చోరీ కేసులో తమను అనవసరంగా ఇరికించారని, ఆపై తనపై లైంగికదాడి చేశారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నలుగురు అధికారులతో ఉన్న బృందం చిత్తూరుకు చేరుకుంది. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌ డూడీతో కేసు విషయంగా భేటీ అయ్యారు. అనంతరం పలువురు అధికారులను విచారించారు.

కేసు నేపథ్యం ఇదీ..

2023 జనవరి 2న పూతలపట్టు మండలం, ముత్తిరేవుల సమీపంలోని సామిరెడ్డిపల్లె గ్రామంలో పి.కృష్ణారెడ్డి (అప్పటి పూతలపట్టు ఎంఈఓ)తో పాటు తన భార్య కల్పనతో కలిసి విధులకు వెళ్లారు. సాయంత్రం ఇద్దరూ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలకి వెళ్లి చూడగా బీరువా సైతం పగులగొట్టారు. బీరువాలో ఉన్న దాదాపు 232 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి పూతలపట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన పుదియంబట్టికి చెందిన ఓ మహిళ ప్రధాన నిందితురాలిగా గుర్తించి, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అయితే తమకు ఈ నేరంతో సంబంధంలేకున్నా పూతలపట్టు పోలీసులు తమపై నింద మోపారని, 2023 జూన్‌ 11వ తేదీన తన భర్త, కుమారుడిని హింసించి, తనను చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ లైంగికదాడి చేశారంటూ కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బాధితురాలి ఫిర్యాద మేరకు చిత్తూరు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పూతలపట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌, కానిస్టేబుల్‌ తనికాచలంలపై కేసు నమోదైంది. అయితే మహిళ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సైతం ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలైంది.

విచారణ ఇలా..

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్‌ఎచ్‌ఆర్‌సీ విచారణ చేపట్టింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఢిల్లీ నుంచి డీఐజీ గౌరవ్‌గార్గ్‌, డీఎస్పీ దుష్యంత్‌, ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌శర్మ, దర్యాప్తు డివిజన్‌ అధికారి సింహాచల్‌దాస్‌ చిత్తూరుకు వచ్చారు. చిత్తూరులోని పోలీసు శిక్షణ కేంద్రం, జిల్లా జైలు, ముత్తిరేవుల ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విచారణ చేపట్టారు. నాడు ఏం జరిగిందనేదానిపై పూతలపట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌, కానిస్టేబుల్‌ తనికాచలంతో పాటు అప్పటి టూటౌన్‌ సీఐ మద్దయ్యఆచారి, డీటీసీ డీఎస్పీ సుధాకర్‌, వైద్యాధికారులను కమిషన్‌ విచారించింది. మరో రెండు రోజుల పాటు ఈ విచారణ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement