చైన్నెలో పళణి 4 రోజుల ప్రచారానికి శ్రీకారం
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చైన్నెలో తమిళనాడును, తమిళ ప్రజల్ని రక్షిద్దామన్న నినాదంతో ప్రజా చైతన్య ప్రచార పర్యటనకు శనివారం శ్రీకారం చుట్టారు. నాలుగు రోజులు చైన్నె, శివారులలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయన పర్యటించనున్నారు. పళణి స్వామి గత ఏడాది జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రలో నిమగ్నమైన విషయం తెలిసిందే. కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా ఈయాత్రకు బ్రేక్ పడింది. తాజాగా ఎన్నికల వేళ యాత్రలు,ప్రచార పర్యటనలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో తన ప్రచార యాత్రను కొనసాగిస్తూ పళణి స్వామి నిర్ణయించారు. శనివారం చైన్నె శివారులోని ఆవడి, అంబత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించారు. ఓటర్లను ఆకర్షించే విధంగా ముందుకు సాగారు. ఆయనకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ఆది, సోమ, మంగళవారం సైతం చైన్నె, శివారులలో పళణి పర్యటన సాగనుంది.
విజయ్ ఎన్నికల
పర్యవేక్షణ కమిటీ
సాక్షి, చైన్నె: ఎన్నికల పర్యవేక్షణ లక్ష్యంగా ప్రత్యేక కమిటీని టీవీకే అధినేత విజయ్ నియమించారు. ఇందులో ప్రధాన పర్యవేక్షణ ప్రతినిధులుగా భుస్సీ ఆనంద్,సెంగొట్టయ్యన్, ఆదవ్ అర్జున ఉన్నారు. ఎన్నికల పనులను వేగవంతం చేసిన విజయ్ పార్టీ పరంగా పలు కమిటీలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఎన్నికల మానిపెస్టో కమిటీ తన పనిని వేగవంతం చేసింది. అలాగే నియోజవర్గాల వారీగా కమిటీలతో ప్రత్యేకంగా ఎన్నికల నిర్వహణ, పార్టీ పరంగా కార్యక్రమాలు, ఏర్పాట్ల పై దృష్టి పెట్టారు. తాజాగారాష్ట్ర స్థాయిలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు పార్టీ పరంగా కమిటీని నియమించారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున, కన్వీనర్ సెంగొట్టయ్యన్‌ను కీలకంగా నియమించారు. వీరి పర్యవేక్షణలో కమిటీలోని ఇతర సభ్యులు పనిచేయనున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా జరిగిన కార్యక్రమంలో భుస్సీ ఆనంద్ మాట్లాడుతూ చేతిలో సినిమాలు లేకుండా రాజకీయాలోకి విజయ రాలేదన్నారు. ఆయన సినిమాల్ని వదలుకుని ప్రజలకోసం రాజకీయాలలోకి వచ్చారని వ్యాఖ్యానించారు.
వివాదాస్పద వ్యాఖ్యలకు స్వస్తి
సాక్షి, చైన్నె: కాంగ్రెస్‌లో ఎవ్వరూ ఇక మీదట కూటమి విషయంగా ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయబోరని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్పష్టం చేశారు. ఏఐసీసీ పెద్దలతో సమావేశానంతరం చైన్నెకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి విషయంగా నియమించిన కమిటీ ఇక, అన్ని వ్యవహారాలు చూసుకుంటుందన్నారు. పార్టీ పరంగా ఏదేని చెప్పదలచుకుంటే ఎంతటి వారైనా సరే తన వద్దకు గానీ, కమిటీ వద్దకు గానీ వచ్చి చెప్పాలని సూచించారు. ఎవరికి వారు ఇక విరుద్ధంగా వ్యాఖ్యలు చేయబోరని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఒకే వేదికగా
234 మంది అభ్యర్థులు
సాక్షి, చైన్నె: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తిరుచ్చి వేదికగా 234 మంది అభ్యర్థులను ఒకే వేదిక పై నుంచి శనివారం రాత్రి పరిచయం చేశారు. ఇందులో 50 మంది మహిళలు ఉన్నారు. అభ్యర్థులు డాక్టర్లు, లాయర్లు, విద్యా వంతులే కావడం విశేషం. లోక్ సభ ఎన్నికలలో నామ్ తమిళర్ కట్చి 8 శాతం ఓట్లతో ఎన్నికల కమిషన్ గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మరో మారు ఒంటరి ప్రయాణంగా 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ కన్వీనర్ సీమాన్ రెడీ అయ్యారు. ఇందు కోసం తిరుచ్చి వేదికగా బ్రహ్మాండ మహానాడును శనివారం నిర్వహించారు. ఆ పార్టీ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా ఏర్పాట్లు చేశారు. తొలుత తమిళనాడు జెండాను, తర్వాత పార్టీ జెండాను సీమాన్ ఎగుర వేశారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను చాటే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు హోరెత్తించారు. డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ తదితర పార్టీలపై సీమాన్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. చివరగా ఆయన తన పార్టీ తరపున 234 స్థానాలలో పోటీచేసే అభ్యర్థులను ఒకే వేదికపై నుంచి పరిచయం చేశారు. వీరిలో 50 శాతం మంది మహిళలుఉండటం విశేషం. ఈ సారి ఎన్నికలలో సైతం తమ సత్తాను చాటుతామని సీమాన్ ధీమా వ్యక్తం చేశారు.
చైన్నెలో పళణి 4 రోజుల ప్రచారానికి శ్రీకారం
చైన్నెలో పళణి 4 రోజుల ప్రచారానికి శ్రీకారం


