మాసి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
తిరుత్తణి: తిరుత్తని ఆలయంలో మాసి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మాసిమాసం బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. శనివారం ఉదయం మూలవర్లకు విశేష అభిషేక పూజలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభంకు పుష్పాలతో అలంకరణ చేపట్టి ఆలయ అర్చకులు మేళ తాళాలు నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజాస్తంభం ముందు కొలువుదీరన శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లకు విశేష అలంకరణలో మహాదీపారాధన చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు ధ్వజారోహణంలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో 11 రోజుల పాటూ నిర్వహించనున్న ఉత్సవ వేడుకల్లో భాగంగా రోజూ ఉదయం సాయంత్రం సమయాల్లో ఉత్సవర్లు వాహన సేవల్లో కొలువై మాడ వీధుల్లో విహరించి భక్తులకు కటాక్షించనున్నారు. 27న రథోత్సవం, మార్చి 1 వల్లి కల్యాణోత్సవ వేడుకలు కమనీయంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టారు.
ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు, విశేష అలంకరణలో ఉత్సవర్లు
మాసి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం


