ఐఐటీలో బీఎస్ ప్రోగ్రామ్
– ప్రారంభించిన డైరెక్టర్ వి. కామకోటి
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసులో మేనేజ్ మెంట్ అండ్ డేటా సైన్స్‌లో కొత్త ప్రోగ్రామ్‌గా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్)ను ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం శనివారం ఐఐటీ ఆవరణలో జరిగింది. ఈ ఇంటర్ డిసిప్లినరీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ఐఐటీ మద్రాసులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ వ్యాపార నిర్ణయాలను డేటా సైనన్స్‌తో అనుసంధానించి, విద్యార్థుల్లో పరిమాణాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, డేటా ఆధారిత సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ పట్టభద్రులకు ఐఐటీ మద్రాస్ నుండి డిగ్రీ ప్రదానం చేస్తారు. ఈ డిగ్రీకి ఇన్‌స్టిట్యూట్ అందించే ఇతర డిగ్రీల మాదిరిగానే విద్యా గుర్తింపు కల్పించారు. అడ్మిషన్లు, లెర్నింగ్ ప్లాట్‌ఫామ్, ప్లేస్‌మెంట్ , కెరీర్ మద్దతును సీఓడీఈ ద్వారా సులభతరం చేయనున్నారు. పరిశ్రమ భాగస్వామ్యాలతో కలిసి ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాస అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఈ ప్రోగ్రామ్ మొదటి బ్యాచ్ జూన్ 2026లో ప్రారంభమవుతుంది. దరఖాస్తుల చివరి తేదీ మే 31వ తేదీగా నిర్ణయించారు.
ఉద్యోగ అవకాశాలు
ఈ కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి శనివారం ప్రారంభించారు. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ఇండియా సైట్ హెడ్, ఎండీ గంగాప్రియ చక్రవర్తి ముఖ్య అతిథిగా, సుందరం ఫైనాన్స్ సంస్థ ఎండీ రాజీవ్ లోచన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కామకోటి మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ ద్వారా తయారీ, బ్యాంకింగ్, ఐటీ, ఇ–కామర్స్, కన్సల్టింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, స్ట్రాటజీ కన్సల్టెంట్ వంటి పదవులకు ఈ కోర్సు అనుకూలంగా ఉంటాయన్నారు. ఈ కోర్సు హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్‌లో అందించబడుతుందని, రికార్డ్ చేసిన ఉపన్యాసాలు, ప్రత్యక్ష ట్యుటోరియల్ సెషల్‌లు, ఆన్‌లైన్ ఫోరమ్‌లతో పాటూ ఆదివారాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్లస్–2, దానికి సమానమైన అర్హత కలిగిన డిప్లొమో హోల్డర్లు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. వయోపరిమితి లేదా సీట్ల పరిమితి లేదని, . ఇన్–హౌస్ క్వాలిఫైయర్ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత ద్వారా ప్రవేశం కల్పిస్తామన్నారు. డేటా ఆధారిత ప్రపంచంలో నాయకత్వానికి అవసరమైన వ్యాపార చాతుర్యం , విశ్లేషణ నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారు చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని తెలిపారు.


