క్లుప్తంగా
అత్యాధునిక
సాంకేతికతతో టేరాన్
సాక్షి, చైన్నె : అత్యాధునిక సాంకేతికతతో టేరాన్ ఆర్ –లైన్‌ను ఎస్‌యూవీని వోక్స్ వ్యాగన్ ఇండియా ఆవిష్కరించింది. తమ ప్రీమియం వాహనంగా ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు ,అత్యాధునిక సాంకేతికతతో ఇది రూపొందిద్దుకున్నట్టు వోక్స్ వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లి తెలిపారు. టేరాన్ ఆర్‌లైన్ 14స్థాయిలలో, 23 విభిన్న లక్షణాలతో నిర్మితమైన అధునాతన టెక్ అని వివరించారు. వినియోగ దారులు జీవితాలకు ప్రతిబింబంగా ఈఎస్‌యూవీ ఉంటుందన్నారు. ఇందులోని ఇంటీరియల్స్, రూపకల్పన, 9 ఎయిర్ బ్యాగ్‌లతో భద్రతా అంశాలు, ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ, టెక్నాలజీ వంటి అంశాలు మరింత ప్రత్యేకతగా పేర్కొన్నారు.
కొత్త బస్టాండ్‌లో శుభ స్వీకార మేడ
వేలూరు: నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.40 లక్షల వ్యయంతో శుభ స్వీకార మేడను నిర్మించారు. దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం మద్యాహ్నం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలారు నది ఒడ్డున శ్మశాన వాటిక ఉందన్నారు. దీంతో వేలూరు పట్టణ ప్రజలు తరచూ మట్టిలో కూర్చొని శుభ స్వీకార కార్యక్రమాలు చేసుకుంటున్నారని తెలిపారు. వర్షాలు వచ్చే సమయంలో కుటుంబ సభ్యులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడే వారన్నారు. దీంతో వేలూరు ప్రజల కోరిక మేరకు ప్రస్తుతం అతి నవీన గదులు, రెండు చోట్ల మేడ ఏర్పాటు చేశామన్నారు. వీటిని వేలూరు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ, కార్పొరేటర్లు మురుగన్, శంకర్ గణేష్, బాల మురళీక్రిష్ణన్, కాంట్రాక్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నెల వ్యవధిలో
22 మంది జాలర్ల అరెస్టు
తిరువొత్తియూరు: రామనాథపురం జిల్లా రామేశ్వరం మండపం చేపలవేట రేవుల నుండి గత నెల 18వ తేదీన సముద్రానికి వెళ్లిన 22 మంది మృత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. 4 మోటారు పడవలను కూడా స్వాధీనం చేసుకుంది. అనంతరం మత్స్యకారులను యాళపాణం, వవునియా జైలు ఆవరణలో వున్న కోర్టు కస్టడీకి పంపారు. ఈ క్రమంలో తమిళనాడు మత్స్యకారులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామేశ్వరం మోటారు పడవల మత్స్యకారులు శనివారం ఒక్క రోజు నిరసన సమ్మె చేపట్టారు. దీనికి సంబంధించి తంగచ్చిమడంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మత్స్యకారులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో నినాదాలు చేశారు.
వృద్ధుడి హత్య
– బిహార్‌కు చెందిన యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె పురసైవాక్కంలో ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేసి నగలు దొంగిలించిన బిహార్‌కు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె పురసైవాక్కం అరసప్పా వీధికి చెందిన వృద్దుడు బాలకృష్ణన్ (61) అతని భార్య 2024లో మరణించింది. పిల్లలు లేరు. దీంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. బాలకృష్ణన్ చైన్నె అన్నా నగర్‌లోని ఓ ప్రైవేట్ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి బాలకృష్ణన్‌కు అతని సోదరుడి కుమారుడు విఘ్నేష్ ఫోన్ చేశాడు. బాలకృష్ణన్ చాలా సేపు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన విఘ్నేష్ నేరుగా వెళ్లి చూశాడు. అప్పుడు బాలకృష్ణన్ ఇంటి తలుపుకు తాళం వేసి ఉంది. కానీ తలుపు కింద రక్తం రావడంతో దిగ్బ్రాంతి చెందారు. వేప్పేరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో ఇంట్లో ఉన్న బంగారు నగలు చోరికి గురైనట్లు తెలిసింది. సీసీటీవీ సుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో ఓ యువకుడు ఇంట్లోకి వెళ్లడం, బయటకు బ్యాగు తో వెళ్లడం రికార్డయింది. అతను బాలకృష్ణన్ పనిచేసే బట్టల దుకాణంలో పారిఽశుధ్య కార్మికుడిగా పనిచేసే బిహార్‌కు చెందిన శ్యామ్ మాథేవ్ (35) అని తేలింది. 5 సవర్ల బంగారు నగలతో భార్యతో కలిసి బిహార్‌కు పారిపోవడానికి యత్నింస్తుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
తిరువొత్తియూరు: చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో మార్వార్ ప్రభుత్వ మహిళా ఉన్నత పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాలలో వెయ్యికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో తరగతి చదువుతున్న నివేధ అనే విద్యార్థిని శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఉపాధ్యాయులు ఆ బాలికను చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. నడుము, ఎముక, మెడ ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. విచారణలో నివేదాతో పాటు చదువుతున్న తోటి విద్యార్థినులు పది రోజుల క్రితం ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారని తెలిసింది. ఆ సెల్‌ఫోన్ పోయిందని, ఆ సెల్‌ఫోన్‌ను వివేదానే దొంగిలించిందని కొత్త సెల్‌ఫోన్ కొనివ్వాలని కొందరు వివేదాను వేధించినట్లు తెలిసింది. నివేదాకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె తాత, నానమ్మతో కలిసి ఉంటోంది. ఈ ఘటన తోటి విద్యార్థినులు, బంధువుల మధ్య తీవ్ర కలకలం రేపింది.


