● వలస పక్షుల విలవిల
అన్నానగర్: మణిముత్తార్ ఆనకట్ట నుండి పక్షుల అభయారణ్యానికి నీటి సరఫరా లేకపోవడంతో పెద్దఎత్తున వలస పక్షులు చనిపోతున్నాయి. వివరాలు.. తిరునెల్వేలి జిల్లాలోని మణిముత్తారు ఆనకట్ట నుండి 80 అడుగుల కాలువ ద్వారా నీటిపారుదల ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నారు. సాధారణంగా డ్యాంలో తగినంత నీరు ఉంటేనే మూడో, నాలుగో రీచ్‌లకు నీటిని విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం డ్యాంలో నీరు ఉన్నప్పటికీ మూడో, నాలుగో రీచ్‌లకు కేవలం 10 క్యూబిక్ అడుగుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. యూరోపియన్ దేశాల నుంచి ఏటా తైమాసం అమావాస్య సమయంలో, చల్లని వాతావరణం ప్రారంభమైనప్పుడు, వలస పక్షులు ఇక్కడి అభయారణ్యం వద్దకు చేరుకుంటాయి. ఆదే నెలలో వాటి సంతానోత్పత్తి కాలం పూర్తయిన తర్వాత తమ పిల్లలతో తిరిగి వెళ్తాయి. అయితే, ఈ సంవత్సరం నీరు తగినంతగా డ్యాం నుంచి విడుదల చేయకపోవడంతో కూందంకుళం పరిసర ప్రాంతాలు ఎండిపోయాయి. ప్రత్యేకించి, కూందంకుళం, నార్త్ కసూర్ చుట్టూ ప్రాంతాలలో వలస పక్షులు నివసించే చెరువుల్లోకి నీరు చేరడం లేదు. అలాగే ఆహార వనరులు పరిమితంగా ఉండడంతో అనేక వలస పక్షులు నీరసించి చనిపోతున్నాయి. కాగా నీటి విడుదల విషయంపై తమిళనాడు ప్రభుత్వం, ప్రజా పనుల శాఖ వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకుని వలస పక్షలను కాపాడాలని రైతులు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
హతవిధీ..!


