రూ.700 కోట్ల విలువైన 230 ఎకరాలు స్వాధీనం
కొరుక్కుపేట: తిరుపోరూర్ కందస్వామి ఆలయానికి చెందిన రూ.700 కోట్లు విలువైన 230 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. 17వ శతాబ్దంలో నిర్మించిన కందస్వామి ఆలయంలోని మొదటి ఆధీనానికి ఆర్కాట్ నవాబు తిరుపోరూర్, తండలం గ్రామాల్లో, తిరుపోరూర్ గ్రామంలోని సుమారు 700 ఎకరాల వ్యవసాయ భూములను చిదంబరం స్వామికి దానం చేసినట్టు రాగి పలకలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ ఆలయానికి వచ్చే అధీనలు (పీఠాధిపతులు) ఆలయంలో పనిచేసిన పూజారులు, ఉద్యోగులు , క్లీనర్లు , దీపం వెలిగించే వారికి , వారి కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 21 రకాల గ్రాంట్లు ఇచ్చారు . మిగిలిన 460 ఎకరాల వ్యవసాయ భూములు ప్రస్తుతం కందస్వామి ఆలయం పేరుతో రెవెన్యూ టైటిల్ కింద ఉన్నాయి. ఈక్రమంలో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకునేలా హిందూ ధర్మదాయ శాఖ చర్యలు చేపట్టింది. తిరుపోరూర్, దాని పరిసర ప్రాంతాల్లో ఆలయానికి చెందిన 230 ఎకరాల భూమిని పోలీసు భద్రత నడుమ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.
పారా అథ్లెట్ శివగామికి ఉద్యోగం
సాక్షి,చైన్నె: అరియలూరుకు చెందిన పారా అథ్లెట్, దృష్టి వైకల్యంతో బాధపడుతున్న కె.శివగామికి పారా అథ్లెట్ ట్రైనర్ పదవికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను శనివారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. శివగామి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. తనతోపాటు ఉన్న ఆరుగురు సోదరులు కూడా దృష్టి వైకల్యంతో బాధపడుతున్నా, ఆమె పారా అథ్లెట్‌గా, షాట్‌పుట్ , డిస్క్‌త్రో పోటీల్లో విజయం సాధించి, రాష్ట్ర, జాతీయ స్థాయి , అంతర్జాతీయ స్థాయి పారా క్రీడల్లో పతాకాలు సాధించారు. కొద్ది రోజుల క్రితం ఆమె చైన్నె ప్రధాన కార్యాలయంలో తాను గెలిచిన పతకాలు, సర్టిఫికెట్లు ఉప ముఖ్యమంత్రికి సమర్పించి ఉద్యోగ అవకాశం కోసం అభ్యర్థించారు. క్రీడా శాఖ కార్యదర్శి సత్యబ్రతసాహు, క్రీడల అభివృద్ధి అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి పాల్గొన్నారు.
పుదుమై పెన్ అవార్డు
క్రికెటర్ హేమమాలినిని పుదుమై పెన్ అవార్డుతో తనిష్క్ అన్నానగర్ నేతృత్వంలో సత్కరించారు. తమిళ హాస్య నటులు బాస్కీ, వీజే బాలా, తనిష్క్ ఆదిత్య సుందరం, జగన్ ఈ అవార్డును అందజేశారు. – సాక్షి, చైన్నె
టెట్ ఫలితాల్లో తప్పులుంటే సరిద్దుకునే అవకాశం
తిరువొత్తియూరు: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. పేపర్–1 , పేపర్–2 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. అర్హత మార్కుల స్థాయిని తగ్గించడంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. కుల ప్రాతిపదికన మార్కులు తగ్గించడంతో గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. కాగా ఉపాధ్యాయ నియామక బోర్డు వెబ్‌సైట్‌లో విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఏమైనా తప్పులు ఉంటే, అభ్యర్థులు వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించారు. సర్టిఫికెట్లలో తప్పులు ఉన్నట్లయితే, అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే వాటిని సరిదిద్ది ఇస్తామని ఉపాధ్యాయ నియామక బోర్డు ప్రస్తుతం ప్రకటించింది. పేరులోని ఇనిషియల్ మార్పు, పుట్టిన తేదీ, అక్షర దోషాలు, లింగ మార్పు వంటి తప్పులు ఉన్నట్లయితే, బ్యాంకులో రూ.200 చెల్లించాలని ప్రకటించారు. డబ్బు చెల్లించిన రసీదుతో పాటు సర్టిఫికెట్‌లో ఉన్న తప్పును పేర్కొంటూ, సర్టిఫికెట్ నకలు జతచేసి ఉపాధ్యాయ నియామక బోర్డుకు పంపాలని తెలియజేశారు.
9న మురుగునీటి పంపింగ్ స్టేషన్ల ముసివేత
తిరువొత్తియూరు: అంబత్తూరు జోన్, కొరటూరు మురుగునీటి పంపింగ్ స్టేషన్‌లో అదనపు ఎలక్ట్రిక్ మోటారు పంపులను ఏర్పాటు చేసే పనులు త్వరలో అధికారులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు జోన్–7 పరిధిలోని కొరటూరు మురుగునీటి పంపింగ్ స్టేషన్, దానికి అనుబంధంగా ఉన్న మురుగునీటి పంపింగ్ స్టేషన్లు తాత్కాలికంగా ముసివేయనున్నట్లు చైన్నె వాటర్ బోర్డు అధికారులు శనివారం ఓప్రకటనలో తెలిపారు. ఈనేపథ్యంలో అంబత్తూరు జోన్ పరిధిలోని ప్రాంతాలలో మురుగునీటికి సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రజలు ప్రాంతీయ అధికారులను సంప్రదించాలని అందులో పేర్కొన్నారు.
రూ.700 కోట్ల విలువైన 230 ఎకరాలు స్వాధీనం


