పద్దు.. పక్కాగా..!
సాక్షి,చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర శాసన సభలో మధ్యంతర బడ్జెట్ దాఖలుకు ద్రావిడ మోడల్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం ఈనెల 17న అసెంబ్లీని సమావేశ పరిచేందుకు స్పీకర్ అప్పావు నిర్ణయించారు. వివరాలు.. ద్రవిడ మోడల్ నినాదంతో ఐదేళ్లు ముందుకు సాగిన డీఎంకే తాజాగా ద్రావిడ మోడల్ 2.ఓ నినాదాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2026 ఎన్నికల ద్వారా మళ్లీ అధికారంలోకి వస్తామని ద్రావిడ మోడల్ 2.ఓ తమిళనాడు సమగ్ర ప్రగతికి వేదిక కానున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్చి మొదటి వారంలో అసెంబ్లీకి నగారా మోగవచ్చనే సంకేతాల నేపథ్యంలో మద్యంతర బడ్జెట్‌ను సభలో దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని శనివారం స్పీకర్ అప్పావు ప్రకటించారు. ఈనెల 17న అసెంబ్లీని సమావేశ పరచనున్నామని తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు సభలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మధ్యంతర బడ్జెట్‌ను దాఖలు చేస్తారన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సబ్సిడీలు, ముందస్తు గ్రాంట్లపై విస్తృతంగా చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని గ్రాంట్ అభ్యర్థనలు, కీలక చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం ఆదేశించినట్టు స్పీకర్ ప్రకటించారు. పారదర్శక పాలన దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఎన్నికల నేపథ్యంలో కీలక హామీలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ తాత్కాలిక బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలపై ప్రభావం చూపే పథకాలు, అదనపు సబ్సిడీల ప్రకటనలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అదనపు సబ్సిడీ, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించే అంశం బడ్జెట్‌లో ఉండవచ్చని సమాచారం. ఈ బడ్జెట్ ద్వారా అనేక కీలక ప్రకటనలు వెలువడే అవకాశముందంటున్నారు. అదే సమయంలో ఇది నామమాత్ర బడ్జెట్ దాఖలుగానే ఉంటుందని, ఇతర కీలక అంశాలన్నీ డీఎంకే తన ఎన్నికల మ్యానిఫెస్టో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశాలు ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


