కనుల పండువగా తైపూస ఉత్సవం
తిరుత్తణి: ౖతెపూసం సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రెండు లక్షలకు పైగా భక్తులు పోటెత్తడంతో మాడ వీధుల్లో రద్దీ నెలకొని భక్తులు ఐదు గంటల పాటు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో తైపూసం సందర్భంగా ఆదివారం వేకువజామున మూలవర్లకు ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు కావళ్లతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తజనం పోటెత్తడంతో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ వివేకానంద శుక్ల ఆధ్వర్యంలో పోలీసులు తోపులాట లేకుండా చేశారు. సాయంత్రం 7 గంటలకు ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో కొలువుదీరి మాడ వీధుల్లో విహరించారు. ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి ఏర్పాట్లు చేశారు.
ఈరోడ్‌లో రథోత్సవం
సేలం: ఈరోడ్‌లోని చెన్నిమలై మురుగన్ ఆలయంలో జరిగిన తైపూసం రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మంత్రి ఎం.పి.స్వామినాథన్ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈరోడ్ జిల్లా చెన్నిమలైలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తైపూసం రథోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున కై లాసనాథర్ ఆలయంలో వళ్లి, దేవసేన సమేత ముత్తుకుమారస్వామికి మహా అభిషేకం తరువాత ఉదయం 6 గంటలకు, కై లాసనాథర్ ఆలయం నుంచి దేవత విగ్రహాలను రథంపైకి తీసుకొచ్చి రథోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
తైపూసం తెప్పోత్సవం
తిరువొత్తియూరు: చైన్నె పురసైవాక్కం శ్రీ గంగాధరేశ్వరర్ ఆలయంలో తైపూసం సందర్భంగా 15 సంవత్సరాల తర్వాత తెప్పోత్సవం జరిగింది. ఇందులో భాగంగా తొలిరోజు శనివారం వినాయకర్ తెప్పం, కర్పగ వినాయకర్ తెప్పం, వేద వినాయకర్ తెప్పల్లో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం పంకాజాంబాల్ సమేత గంగాధరేశ్వరర్ తెప్పం, మంగళవారం వళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి తెప్ప ఉత్సవం జరగనున్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో హిందూ, ధర్మాదాయశాఖ జాయింట్ కమిషనర్ ముల్‌లై, అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరి, ఈఓ శివప్రకాశం, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
పెద్దపాళ్యం, శిరువాపురి ఆలయాలలో..
తిరువళ్లూరు: తైపూసం ఉత్సవాల్లో భాగంగా పెద్దపాళ్యం భవానీ, శిరువాపురి మురుగన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిరువాపురి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. పెద్దపాళ్యం భవానీ ఆలయంలోనూ తైపూసం ఉత్సవాలను నిర్వహించారు. ఆలయంలో 108 కలశాల గంగ నీటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
కనుల పండువగా తైపూస ఉత్సవం
కనుల పండువగా తైపూస ఉత్సవం
కనుల పండువగా తైపూస ఉత్సవం
కనుల పండువగా తైపూస ఉత్సవం
కనుల పండువగా తైపూస ఉత్సవం


