ఆ ఇద్దరి సేవలు చిరస్మరణీయం
కొరుక్కుపేట: దేశ స్వాతంత్య్రం కోసం చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓమందూరార్ రామస్వామిరెడ్డి, తిరుమల నాయకర్ల సేవలు చిరస్మరణీయమని అఖిల భారత తెలుగు సమాఖ్య(ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి అన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఓమందూరార్ రామస్వామి రెడ్డి 131వ జయంతి, విజయనగర సామ్రాజ్య ఆధిపత్యం నుంచి మదురైని స్వతంత్రం చేసి కళలు, నిర్మాణాలకు గొప్ప ప్రోత్సాహమందించిన తిరుమలనాయకర్ 443వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కావడి సింధూ ఓమందూర్ రెడ్డియార్ సంక్షేమ సంఘం–ఏఐటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె కీల్పాక్‌లోని ఏఐటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలకు సీఎంకే రెడ్డి సారథ్యం వహించారు. ముందుగా ఓమందూరార్, తిరుమలనాయకర్ చిత్రపటాలకు సభికులతో కలసి ఆయన నివాళులర్పించారు. అనంతరం వేదిక ప్రాంగణంలో ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ప్రారంభించి పారిశుధ్య కార్మికులు, పేదలకు సంక్షేమ సహాయాలు పంపిణీ చేశారు. ఏఐటీఎప్ ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీఎం కిషోర్, డా.గొల్లపల్లి ఇజ్రాయేలు, లయన్ వీజీ జయకుమార్, సీహెచ్ తిరుమలరావు, కావడి సింధూ సంఘం అధ్యక్షుడు బి.నాగేంద్రన్, గంటా రోశయ్య, పాల్ కొండయ్య, సారథినాయుడు పాల్గొన్నారు.


