తెన్కాసిలో సెన్సరీ పార్క్
సాక్షి, చైన్నె: వైకల్యాలు ఉన్న వ్యక్తుల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ తెన్కాసి జిల్లా ఆయ కుడిలో కీలక అడుగుగా సెన్సరీ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ మద్దతుతో అమర్ సేవా సంఘం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ సెన్సరీ పార్క్ అభివృద్ధి చేసింది. ప్రకృతి ఆధారిత చికిత్స, సార్వత్రిక అంశాలు, పునరావాసాన్ని ఏకీకృతం చేస్తూ ఈ ఉద్యానవనం వైకల్యాలున్న పిల్లలు .పెద్దల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి దోహదం కానున్నది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో సమ్మిళిత, సమాజ ఆధారిత పునరావాసానికి ఒక మైలురాయిగా నిలిచే విధంగా రూపకల్పనచేశారు.
ఆస్ట్రేలియన్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు , వాణిజ్య శాఖ నిధులతో, చైన్నెలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్–జనరల్ ద్వారా అమలు చేయబడిన ఈ ప్రాజెక్టుకు రూ. 8 లక్షల గ్రాంట్ అందించారు. సెన్సరీ పార్క్‌ను చైన్నెలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్–జనరల్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ కామెరాన్ నోబుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకల్యాలున్న వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించేందుకు అనుకూలమైన సమ్మిళిత సమాజాలను నిర్మించడంలో కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియా అంతర్జాతీయ వైకల్య సమానత్వం. హక్కులకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. అమర్ సేవా సంఘం ప్రమోటర్, కో–చైర్మన్ ఎస్. శంకర రామన్ మాట్లాడుతూ, ‘‘ఈ సెన్సరీ పార్క్ మేధో , అభివృద్ధి ప్రాజెక్టు అని పేర్కొంటూ, వైకల్యాలున్న పిల్లలు, పెద్దలకు ఒక అభయ హస్తంగా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెన్కాసి జిల్లా కలెక్టర్ కమల్ కి షోర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మాజీ సీబీఐ డైరెక్టర్ డి.ఆర్. కార్తికేయన్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


