ఆదర్శం.. ద్రావిడ మోడల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. ద్రావిడ మోడల్‌

Jan 31 2026 6:50 AM | Updated on Jan 31 2026 6:50 AM

ఆదర్శం.. ద్రావిడ మోడల్‌

ఆదర్శం.. ద్రావిడ మోడల్‌

● సీఎం స్టాలిన్‌ ● వారిది నమ్మక ద్రోహుల కూటమి ● 5న రాష్ట్ర మంత్రి వర్గం భేటీ

వాషింగ్‌మిషన్‌ కథ

సాక్షి, చైన్నె: దేశానికి ఆదర్శంగా ద్రావిడ మోడల్‌ పాలన సాగుతోందని సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు. చైన్నెలో శుక్రవారం ఓ ఛానల్‌ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌ హాజరయ్యారు. తమిళనాడు సమ్మిట్‌–2026 కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ద్రావిడ మోడల్‌ పాలన దేశానికి మార్గదర్శకంగా, ఆదర్శంగా మారిందని అభివర్ణించారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తమిళనాడులో టైర్‌–2, టైర్‌–3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలు సైతం సమానంగా అభివృద్ధి చెందాయని వివరించారు. ద్రావిడ మోడల్‌ పాలన ద్వారా రాష్ట్రం 11.19 శాతం ఆర్థిక వృద్ధి సాధించిందన్నారు. మహిళలకు నెలకు వెయ్యి లెక్కన ఇప్పటివరకు రూ.33,464 కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం అమలుతో పిల్లల హాజరు శాతం గణనీయంగా పెరిగిందన్నారు.

ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులు

తమిళనాడులో ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా కలైంజ్ఞర్‌ సెంటినరీ లైబ్రరీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, బస్‌ టెర్మినల్స్‌, ఫ్లైఓవర్లు, మ్యూజియం లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం కారణంగా విద్యా రంగంలో నిధులకు, మెట్రో ప్రాజెక్టుల అనుమతులు వంటి అంశాల్లో తమిళనాడుకు కేంద్రం నుంచి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. భారతదేశం ‘రాష్ట్రాల సమాఖ్య’ అని గుర్తు చేస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడడమే నిజమైన దేశభక్తి అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ద్రావిడ మోడల్‌కే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ద్రావిడ మోడల్‌ 2.0 ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం’’ అని ప్రకటించారు. వారసత్వ రాజకీయాల గురించి తాను మాట్లాడనని పేర్కొంటూ, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు అని సూచించారు.

5న మంత్రి వర్గం భేటీ

రాష్ట్ర మంత్రి వర్గం ఫిబ్రవరి 5న సమావేశం కానుంది. సీఎం స్టాలిన్‌ సమక్షంలో చైన్నెలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నగారా మార్చిలో మోగేందుకు అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అంతలోపు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌ను దాఖలు చేయడానికి స్టాలిన్‌ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు చేపట్టే దిశగా మంత్రి వర్గం భేటీకి పిలుపునిచ్చారు. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం, వివిధ అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే విధంగా, కొన్ని కొత్త ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసే రీతిలో కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉండగా శని, ఆదివారాల్లో సీఎం స్టాలిన్‌ శివగంగ జిల్లాలో క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు.

అవినీతి ఆరోపణలను తమ మీద గుప్పిస్తున్నారని, నిందుల వేస్తున్నారని ప్రస్తావిస్తూ, ఈసందర్భంగా తాను బీజేపీని ప్రశ్నిస్తున్నా అని వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులలో దోషిగా ఉన్న అన్నాడీఎంకే తమరి వాషింగ్‌మిషిన్‌లో పడగానే, వైట్‌ వాష్‌ అన్నట్టుగా ఆ మరకలు చెరిగిపోయాయా అని ధ్వజమెత్తారు. బీజేపీ, అన్నాడీఎంకేది నమ్మక ద్రోహ కూటమి అని వ్యాఖ్యలు చేశారు. ఈ ద్రోహులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. తమను హిందూ వ్యతిరేక పార్టీ అని చెబుతున్నారని, ఈ తమిళనాడులో తమ హయాంలో ఏ మేరకు ఆలయాలు అభివృద్ధి చెందాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. దేశంలోనే తమిళనాడును నంబర్‌ ఒన్‌ రాష్ట్రం అని గర్వంగా తాము చెప్పుకుంటున్నామని తెలిపారు. మంత్రులు శేఖర్‌బాబు, టీఆర్‌పీ రాజా, ఎన్‌డీటీవీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ అధికారి రాహుల్‌ కన్వాల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వీరరాఘవ్‌, మేనేజింగ్‌ ఎడిటర్‌ శివఅరూర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement