అంతా సంతృప్తికరం!
సాక్షి, చైన్నె: కూటమిలో సీట్ల పందేరం, పొత్తుల చర్చలు అన్నీ సంతృప్తికరంగానే సాగుతున్నాయని డీఎంకే ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి తెలిపారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో రెండు రోజుల క్రితం కనిమొళి సమావేశమైన విషయం తెలిసిందే. డీఎంకేలో పొత్తు విషయంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచార వ్యవహారం ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలను గాడిలో పెట్టాలని డీఎంకే తరఫున ఏఐసీసీకి సూచించినట్టు సమాచారం. అలాగే, సీట్ల పందేరం విషయంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈపరిస్థితుల్లో శుక్రవారం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ పొత్తులు, సీట్ల చర్చలు అన్నీ సంతృప్తికరంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో ఎలాంటి వివాదాలు లేవని అంతా సజావుగానే సాగుతున్నట్టు వివరించారు. డీఎంకే, కాంగ్రెస్‌లు చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో సీట్ల పంపకాల చర్చలు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ బృందం ఇప్పటికే తమ అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసిందని గుర్తుచేశారు. కూటమిలోకి కొత్త పార్టీలు చేరే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు వేచి ఉండాలని సూచించారు. డీఎంకే అధికారంలోకి మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 95 శాతం హామీలను అమలు చేశామని, ప్రజలకు నిరంతరం ప్రభుత్వం అండగా ఉంటున్నదని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకాలలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారే అని ప్రశ్నించగా, చర్చలు సంతృప్తికరం, ఫలితాలు సానుకూలం అని ముగించారు.
బహిరంగ వ్యాఖ్యలు వద్దు
ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో కూటమి విషయం, సీట్ల పందేరం విషయంగా బహిరంగంగా నాయకులు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై హెచ్చరించారు. కూటమి విషయంగా, సీట్ల చర్చల విషయంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటై ఉందని, వారు తప్ప, పార్టీ నేతలు ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడానికి వీలు లేదని, చేస్తే కఠిన చర్యలు తప్పదన్న హెచ్చరికలు చేయడం గమనార్హం. అదేసమయంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాకూర్ స్పందిస్తూ, కాంగ్రెస్‌ను ఉద్దేశించి డీఎంకే నేత ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమే కాకుండా, మదురై ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు అప్పగించాలని పట్టుబట్టనున్నామని వ్యాఖ్యలు అందుకోవడం గమనార్హం.


