భూ ప్రకంపనల కలకలం
సాక్షి, చైన్నె: తూత్తుకుడి, తెన్‌కాశి, విరుదునగర్ జిల్లాల్లో అనేక చోట్ల భూ ప్రకంపన కలకలం బయలుదేరింది. భూమి కంపించినట్టుగా పరిస్థితి నెలకొనడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి, నల్లట్టి పుదూర్, విశ్వదాస్‌నగర్, ఇందిరానగర్, శోభనగర్, పాండువర్మ మంగళం ప్రాంతాలలో గురువారం రాత్రి భూమి కంపించినట్టుగా పరిస్థితి నెలకొనడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని వస్తువలు కదిలాయని, కుర్చీల, సోపాలు సైతం కదిలినట్టుగా అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, తెన్కాసి జిల్లా చెల్లపట్టి, వరగనూరు పరిసరాలలో, విరుదునగర్‌లో అనేక ప్రాంతాలలో భూమి కంపించినట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ ప్రకంపన తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 3 నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ పరిసరాలలో భూమి కంపించేందుకు గల కారణాలపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. రాత్రంతా ఇళ్లలోకి వెళ్లకుండా ఉన్న జనం వేకువ జామున సాహసం చేసి లోనికి వెళ్లారు. అయితే, ఈప్రకంపన రూపంలో ఆందోళన ఆ పరిసర వాసులను వీడడంలేదు.
జయరామ్‌ను
సిట్ విచారణ
సాక్షి, చైన్నె: శబరిమలై అయ్యప్ప ఆలయంలో బంగారం స్కాం కేసులో సినీ నటుడు జయరామ్ వద్ద సిట్ అధికారులు శుక్రవారం చైన్నెలో విచారించి, ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. కేరళలోని శబరిమలై అయ్యప్ప సన్నిధానంలోని బంగారు స్కాం పెను కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈకేసును సిట్ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్‌కు పరిచయం ఉన్నట్టు విచారణలో వెలుగు చూడడం చర్చకు దారి తీసింది. జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో బంగారం పూత వేసిన వస్తువులు ఉపయోగించారన్న ప్రచారం సైతం సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైన్నెలోని జయరామ్ నివాసానికి సిట్ అధికారులు శుక్రవారం వచ్చారు. ఆయన వద్ద విచారణ జరిపి, వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలిసింది. బంగారం పూత వేసిన వస్తువుల గురించి, ఉన్నికృష్ణన్‌తో పరిచయం, శబరిమలై నుంచి ఆ వస్తువులను తీసుకొచ్చారా అనేక ప్రశ్నలకు సమాధానాలు వాంగ్మూలం రూపంలో సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
నైల్లెకి రెండు ప్రత్యేక రైళ్లు
కొరుక్కుపేట: తైపూసం సందర్భంగా చైన్నె ఎగ్మూర్, తాంబరం నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు సదరన్ రైల్వే ప్రకటించింది. చైన్నె ఎగ్మూర్ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ (06012) జనవరి 30 రాత్రి 11:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11–15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (06002) ఫిబ్రవరి 1 తేదీ రాత్రి 10.35 గంటలకు తిరునెల్వేలి నుంచి బయలుదేరి ఉదయం 9.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ప్రత్యేక రైలు (06003) జనవరి 31 తాంబరం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.50 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (06064) తూత్తుకుడి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి 11.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చైన్నె సెంట్రల్ చేరుకుంటుందని దక్షిణ రైల్వే ప్రకటించింది.
ఆవిష్కరణలకు వేదిక
ఏఐ కాన్‌క్లేవ్
సాక్షి, చైన్నె : బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు స్వీకరణ, సంస్థాగత పరివర్తన, విద్యాపరంగా ఆవిష్కరణలకు ఏఐ కాన్‌క్లేవ్ వేదికగా నిలిచినట్టు విద్యా వేత్తలు వ్యాఖ్యానించారు. మాస్టర్ స్టాఫ్ ఏఐ కాన్ క్లేవ్‌లో విశ్వవిద్యాలయాలలో అంతరాయం, నీతి, విధానం, ఏఐ స్వీకరణ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. మాస్టర్ సాఫ్ట్ ఈఆర్‌పీ సొల్యూషన్స్ నేతృత్వంలో హయ్యర్ ఎడ్యుకేషన్ లీడర్స్ ఏఐ కాన్ క్లేవ్–2026 చైన్నెలో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా పర్యావరణ వ్యవస్థలను వేగవంతం చేయడం, పునర్నిర్మించడంలో విశ్వ విద్యాలయాల పాత్ర గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఏఐ ఆధారిత విద్యావస్థలో మాస్టర్ సాఫ్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించారు. మాస్టర్ సాఫ్ట్ వ్యవస్థాపకుడు షామ్ సోమాని ఏజెంటిక్ ఏఐ యుగం గురించి ప్రత్యేకంగా వివరించారు. మాస్టర్ సాఫ్ట్ సీఈఓ గౌరవ్ సోమాని, గురుదేవ్ , విద్యా వేత్తలు వైభవ్ , వి భారతీ హరిశంకర్, ఎన్ వేల్మురుగన్, డాక్టర్‌షీజా వర్గీస్.డాక్టర్ పాల్ విల్సన్, డాక్టర్‌కె శ్రీధర్, ఎస్ మోహన్, శశి ప్రభ, శుభయ భారతి కాన్‌క్లేవ్‌కు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


