మహాత్ముడికి నివాళి
సాక్షి, చైన్నె: మహాత్మాగాంధీ 79వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఽశుక్రవారం ఆయన చిత్ర పటాలు, విగ్రహాల వద్ద రాజకీయపార్టీల నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలోని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్ర పటానికి సీఎం స్టాలిన్‌తో పాటు మంత్రులు పుష్పాంజలి ఘటించారు. గాంధీ మండపంలోని విగ్రహానికి గవర్నర్ రవి నివాళుర్పించారు. గాంఽధీజీ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా అధికారిక వేడుకగా ప్రభుత్వ నేతృత్వంలో ఉదయం నిర్వహించారు. వాడవాడల్లోని బాపూజీ విగ్రహాలకు నేతలు, అఽధికారులు, సంఘాల ప్రతినిధులు అంజలి ఘటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లోనూ గాంధీకి నివాళులర్పించారు. చైన్నె ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలోని మహాత్ముడి విగ్రహం, పరిసరాలను సప్త వర్ణ పుష్పాలతో అలకరించారు. ఇక్కడ గాంధీ చిత్ర పటాన్ని ఉంచారు. చిత్ర పటానికి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం సుబ్రమణియన్, శేఖర్‌బాబు పుష్పాంజలి ఘటించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి గిండిలోని గాంధీ మండపం వద్ద విగ్రహానికి అంజలి ఘటించారు. ఇక్కడి స్మారక ప్రదేశంలో పుష్పాంజలితో నివాళులర్పించారు. అలాగే, కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు గాంధీ మండపం, ఎగ్మూర్‌లోని విగ్రహం వద్ద నివాళులర్పించారు.
అంటరాని తనం నిర్మూలనకు ప్రతిజ్ఞ
సచివాలయంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు, పోలీసు కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు ఇతర ప్రాంతాల్లో అంటరానితనం నిర్మూలన, అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. సచివాలయం ఆవరణలోని ఆర్మీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఐఏఏస్‌లు, ఉద్యోగులు అందరితో సీఎస్ మురుగానందంతో కలిసి సీఎం స్టాలిన్ ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా, రాజకీయ శాసనాలకు కట్టుబడి అంటరానితనాన్ని పునాదులు సహా పెకిలించేందుకు దూసుకెళ్తామని, సమాజంలో వివక్షకు ఆస్కారం లేకుండా పనితీరును కనబరుస్తామని సీఎం స్టాలిన్ పేర్కొనగా, ఆయనతో కలసి ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం, చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. చైన్నెలోని సత్యమూర్తిభవన్‌లో బాపూజీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై పుష్పాంజలి ఘటించారు.
మహాత్ముడికి నివాళి


