ఘనంగా స్నాతకోత్సవం
–గవర్నర్‌కు టీచర్ పాదాభివందనం
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి పాదాలకు కోయంబత్తూరుకు చెందిన ఉపాధ్యాయురాలు శశికళ నమస్కరించి, మీరు ఆదర్శం అని వ్యాఖ్యలు చేశారు. చైన్నె సైదాపేటలోని తమిళనాడు టీచర్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూరుకు చెందిన ఉపాధ్యాయురాలు శశికళ డిగ్రీ అందుకుంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బెంగళూరులోని ఇస్రో స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్ స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈవేడుకలో 119 మందికి వేదికపైనే పట్టాలు అందజేయగా, 76,903 మందికి పోస్టు ద్వారా డిగ్రీలు పంపించారు. కోయంబత్తూరుకు చెందిన శశికళ మూడు బంగారు పతకాలు సాధించారు. పతకాలు అందుకున్న అనంతరం ఆమె గవర్నర్ పాదాలకు నమస్కరించడంతో ఆడిటోరియంలో కొంతసేపు కలకలం నెలకొంది. గవర్నర్ మాట్లాడుతూ శశికళ తనను ఆదర్శంగా భావిస్తున్నట్లు వేదికపై చెప్పారని వెల్లడించారు. అనంతరం శశికళ మాట్లాడుతూ తమిళనాడు గవర్నర్‌ను తాను ఆదర్శంగా భావిస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం గర్వకారణం అని తెలిపారు. అలాగే తనకు గవర్నర్‌ను కోరాల్సిన ఒక వ్యక్తిగత అభ్యర్థన ఉందని, దానిని వ్యక్తపరచాలనే ఉద్దేశంతోనే వేదికపై మాట్లాడానని శశికళ చెప్పారు. తాను ప్రస్తుతం ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, కోయంబత్తూరు సమీపంలో ఒంటరిగా నివసిస్తున్నట్లు వెల్లడించారు.


