ఆ రెండు అన్నాడీఎంకే ఖాతాకేనా?
– రెండవ రోజు పళణి విస్తృత కసరత్తు
సాక్షి, చైన్నె: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో రెండవ రోజుగా శుక్రవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి బిజీ అయ్యారు. రెండు స్థానాలను తమ ఖాతాలోకి వేసుకునే దిశగా నేతలు అభిప్రాయాలను మెజారిటీ శాతం మేరకు వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఖాళీ కానున్న రాజ్యసభ పదవుల్లో రెండు స్థానాలు అన్నాడీఎంకే వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఓస్థానం కోసం డీఎండీకే, మరోస్థానం కోసం బీజేపీ కుస్తీలు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఎవ్వరికీ ఈసారి సీటు ఇవ్వకుండా తమ నేతలకే అప్పగించే విధంగా పళణిస్వామి నిర్ణయించినట్టు సమాచారం. పార్టీలో ఆశావహులు అధికంగా ఉండడంతో వారిలో ఇద్దరిని ఎంపిక చేయడానికి తీవ్ర కసరత్తులలో ఉన్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు జిల్లాల కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లతో పళణిస్వామి సమావేశం అయ్యారు. రెండవ రోజుగా శుక్రవారం కూడా బిజీ అయ్యారు. మెజారిటీ శాతం మంది నేతలు ఈసారి రాజ్యసభ సీటును ఎవ్వరికి దారాదత్తం చేయొద్దని సూచించినట్టు సమాచారం. దీంతో రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టే దిశగా పళణి వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. ఈ సీట్లు దక్షిణ తమిళనాడులోని ఇద్దరు నేతలకు చేరే అవకాశాలు ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.


