జూన్‌లో విశేష ఉత్సవాలు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో జూన్ నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 06, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. 7వ తేదీ నుంచి 11 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు, 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధుల్లో గజ వాహనంపై అమ్మవారు విహారం ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి అనుబంధంగా వెలసిన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో జూన్ 5న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరగనుంది. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో జూన్ 17 నుంచి 19 వరకు శ్రీ సుందరరాజ స్వామి వారి అవతారోత్సవాలు జరుగుతాయి. జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారు సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై దర్శనమిస్తారు. అమ్మవారి ఆలయంలో వెలసిన శ్రీబాలకృష్ణ స్వామివారికి 24న తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


