వాయుగండం

- - Sakshi

గురువారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

వేదారణ్యంలో ఒడ్డుకే పరిమితమైన పడవలు

సాక్షి,చైన్నె: డెల్టాతో పాటు తొమ్మిది జిల్లాలకు వాయుగుండం రూపంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో రెండురోజులు అనేక జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ బాలచంద్రన్‌ ప్రకటించారు. డెల్టాతో పాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో ఆ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్ర తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో జాలర్లు రెండో రోజుగా ఒడ్డుకే పరిమితమయ్యారు.

బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో నెల కొన్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో డెల్టా జిల్లాల్లో అనేక చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. మంగళవారం నుంచి వర్షాలు ఈ జిల్లాలో పడుతుండడంతో బుధవారం కూడా బడులకు అనేక చోట్ల సెలవు ప్రకటించారు. ఈ వాయుగుండం రూపంలో తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల భారీగా మరికొన్ని చోట్ల అతిభారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.

తొమ్మిది జిల్లాల్లో..

డెల్టాలోని నాగపట్నం, మైలాడుతురై, పుదుకోట్టై, కడలూరులో అధిక వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలో వర్షాలు కుండపోతగా పడడంతో వరి పంట అనేక చోట్ల దెబ్బతింది. నాగపట్నం జిల్లాలో లక్ష ఎకరాల వరి పంట వరద పాలుకావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. కావేరి జలాలు సకాలంలో అందకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్రకష్టాలను డెల్టాలోని అనేక జిల్లాల రైతులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాల పుణ్యమా ఉన్న కాసింత పంట కూడా వరద పాలు కావడం రైతులను కంట తడి పెట్టిస్తోంది. వాయుగుండం రూపంలో మరింతగా వర్షాల నేపథ్యంలో డెల్టా జిల్లా గజగజ వణికి పోతోంది. ఈ జిల్లాలో మంత్రులు, ప్రత్యేక ఐఏఎస్‌ అధికారుల బృందాలు తిష్ట వేశాయి. విల్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాలోనూ వర్షాలు భారీగానే పడుతున్నాయి. చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల తెరపించి తెరపించి వర్షం పడుతుండగా, మరికొన్ని చోట్ల చిరుజల్లుల వర్షం కురుస్తోంది. చైన్నె శివార్లని రెడ్‌హిల్స్‌, పూందమల్లి, పొన్నేరి పరిసరాలలో మంగళవారం రాత్రంతా 5సె.మీకి పైగా వర్షం కురిసింది.

13 శాతం తక్కువే...

తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 27 సె.మీ వర్షం పడాల్సి ఉంది. అక్టోబర్‌లో ఆశించిన స్థాయిలో వర్షం పడలేదు. నవంబర్‌లో కాస్త మెరుగు పడడంతో ఇప్పటివరకు 24 సె.మీ వర్షం పడింది. అయినా సాధారణ వర్షం కంటే 13 శాతం తక్కువగానే కురిసింది. తాజా వర్షాలతో చైన్నె శివార్లలోని చెంబరంబాక్కం, చోళవరం, పూండి రిజర్వాయర్లలోకి నీటి రాక పెరుగుతోంది. చైన్నెలో వర్షాల రూపంలో ఎదురయ్యే కష్టాలు, ప్రమాద సమాచారాలు, ఫిర్యాదులకు కార్పొరేషన్‌ భవనం రిప్పన్‌ బిల్డింగ్‌లో 24 గంటల సేవలతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు షిఫ్ట్‌లుగా నలుగురు రెవెన్యూ అధికారులు, ముగ్గురు చొప్పున సబ్‌ కలెక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారులతో పాటు 54 మంది విధుల్లో ఉన్నారు. చైన్నెలోని అన్ని సబ్‌వేలలోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆయా లోతట్టు ప్రాంతాలలో పది ట్రాక్టర్ల ద్వారా భారీ మోటార్లను సిద్ధంచేసి ఉంచారు. ఈ కంట్రోల్‌ రూమ్‌కు మంగళవారం నుంచి 290 కాల్స్‌ రాగా, 55 ఫిర్యాదులను తక్షణం పరిష్కరించారు. 150 చోట్ల పనులు జరుగుతున్నాయి. చైన్నెలో రైల్వే, మెట్రోలతో పాటు 11 విభాగాల సమన్వయంతో ముందు జాగ్రత్తలను సిద్ధం చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ, పరిశీలిస్తున్నామని కార్పొరేషన్‌ మేయర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. చైన్నెలో 41 చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడగా, వాటిని ఆగమేఘాలపై తొలగించారు.

న్యూస్‌రీల్‌

డెల్టా గజగజ

నాగైలో లక్ష ఎకరాల వరి పంట వరద పాలు

9 జిల్లాలకు భారీ వర్షాలు

ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు

ఒడ్డుకే జాలర్ల పరిమితం

ఒడ్డుకే జాలర్లు..

సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చైన్నె సముద్ర తీరంలో అలలు ఆక్రోశంగా ఉన్నట్టు పరిస్థితి కనిపించింది. చైన్నె నుంచి తూత్తుకుడి, కన్యాకుమారి వరకు సముద్ర తీరంలో గాలి 50 కి.మీ వేగంతో వీస్తున్నాయి. దీంతో జాలర్లు తమ పడవలను ఒడ్డున సురక్షితం చేసుకున్నారు. వేటకు వెళ్లలేని పరిస్థితులతో ఒడ్డుకే జాలర్లు పరిమితమయ్యారు. సముద్ర తీరాలలో తలా 50 మందితో కూడిన 18 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తిష్టవేశాయి.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top