
చెట్ల కొమ్మలను తొలగిస్తున్న సిబ్బంది
సాక్షి, చైన్నె : కన్యాకుమారి జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. గత రెండు రోజులుగా కన్యాకుమారిలో వర్షం పడుతూ వస్తోంది. బుధవారం వర్షం తీవ్ర రూపం దాల్చింది. కన్యాకుమారి జిల్లావ్యాప్తంగా కుండపోతగా వర్షం పడుతుండడంతో బుధవారం బడులకు సెలవు ప్రకటించారు. తిరుప్పరపు జలాశయంలో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో సందర్శకులకు నిషేధం విధించారు. కొండ కోనల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల విరిగిపడ్డ చెట్ల కొమ్మలను సిబ్బంది ఆఘ మేఘాలపై తొలగించారు. పొరుగున ఉన్న తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మరింతగా వర్షాలు పడే అవకాశా లతో ముందు జాగ్రత్తలపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కోసం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి.