అన్నానగర్: పళణి మురుగన్ ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు ద్వారా రూ.3 కోట్ల ఆదాయం వచ్చింది. దిండుక్కల్ జిల్లా పళణి మురుగన్ ఆలయం ఆరుపడై వీడుల్లో మూడవదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి స్వామి దర్శనం కోసం రోజూ వేలాదిమంది భక్తులు సందర్శిస్తారు. ముఖ్యంగా పండుగ సమయంలో ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలా వచ్చే భక్తులు ఆలయ ప్రాంతంలో ఉంచిన హుండీలో డబ్బులు, బంగారం, వెండి వస్తువులను కానుకలుగా చెల్లిస్తారు. అలా గత నెల 20, 21 తేదీల్లో పళణి మురుగన్ ఆలయంలో కానుకల లెక్కింపు చేపట్టారు. ఆలయ అసోసియేట్ కమిషనర్ నటరాజన్ నేతృత్వంలో పళణి కొండ ఆలయంలోని హుండీ ద్వారా రూ.2,91,86,546 ఆదాయం లభించింది. అలాగే మలేషియా, సింగపూర్, శ్రీలంక సహా 762 విదేశీ కరెన్సీ నోట్లను చెల్లించారు. ఇక 1,029 గ్రాముల బంగారం, 33.67 కిలోల వెండి కూడా వచ్చింది. ఆలయ అధికారులు, బ్యాంకు ఉద్యోగులు పళణి ఆండవర్ ఆర్ట్స్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు దాదాపు 100 మందికి పైగా హండీ లెక్కింపులో పాల్గొన్నారు.
కాట్పాడి సమీపంలో లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
– ప్రయాణికులు సురక్షితం
వేలూరు: బెంగుళూరు నుంచి చైన్నెకు లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ఉదయం కాట్పాడి మీదుగా వచ్చింది. రైలు వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని వలత్తూరు వద్ద వస్తున్న సమయంలో డీ9 బోగీ నుంచి ఉన్నపలంగా పొగలు అధికసంఖ్యలో వచ్చింది. వీటిని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. మంటలు క్రమంలో ఇతర బోగీలకు వ్యాపించడంతో గమనించిన ప్రయాణికులు ఉన్నఫలంగా రైలులోని అత్యవసర చైన్‌ను లాగారు. వెంటనే మార్గం మధ్యలోనే నిలిపి వేశారు. వెంటనే ఇంజిన్ డ్రైవర్, టికెట్ కలెక్టర్లు రైలు బోగీని పరిశీలించారు. ఆ సమయంలో రైలు చక్రంలో రాపిడి జరిగి.. మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. అనంతరం రైలు ఇంజిన్ డ్రైవర్ చాకచక్యంగా రైలును కాట్పాడికి తీసుకొచ్చి అక్కడ సిబ్బందితో రైలు చక్రాలను సరి చేసి అర్ధగంట తర్వాత రైలును ప్రయాణానికి సిద్ధం చేశారు.
ఈరోడ్ కమిషనర్‌పై ఏసీబీ గురి
సాక్షి, చైన్నె : ఈరోడ్ కార్పొరేషన్ కమిషనర్ శివకుమార్‌ను ఏసీబీ టార్గెట్ చేసింది. ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. వివరాలు.. ఈరోడ్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న శివకుమార్ ఇటీవల జరిగిన ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈయన గతంలో పల్లావరంలో పనిచేశారు. అప్పట్లో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిని ప్రస్తుతం ఏసీబీ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. పెరియర్ నగరంలోని ఆయన నివాసానికి సాయంత్రం ఏసీబీ అధికారులు వెళ్లారు. ఈ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరు లేదు. దీంతో అధికారులు కొంత సేపు వేచి చూశారు. సమాచారం అందుకున్న కుటుంబీకులు, కమిషనర్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం అధికారులు ఆయన ఇంట్లో సోదాలు ప్రారంభించారు. ప్రస్తుతం కీలక డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో అకాల వర్షాలు మరో రెండురోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. వివరాలు.. రాష్ట్రంలో ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతు పవనాల సీజన్‌కాలం కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఈ పవనాల రూపంలో వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. ఫిబ్రవరితో శీతాకాలం ముగియగానే, మార్చి మొదటి వారం నుంచి మే, ఏప్రిల్ చివరి వరకు రాష్ట్రంలో భానుడు ప్రతాపం సహజం. అయితే ఈ ఏడాది మార్చిలో ఇంత వరకు వేసవి ప్రతాపం పెరగ లేదు. ఇందుకు కారణం, గాలి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉండడంతో పాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో అనేక చోట్ల అకాల వర్షం కురిసింది. ఎక్కువ చోట్ల రైతులు నష్టపో యారు. ఈ వర్షాల ప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తదుపరి క్రమంగా భానుడు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
శివకుమార్ నివాసం


