మళ్లీ గుడుంబా బట్టీలు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ గుడుంబా బట్టీలు

Nov 27 2026 4:14 AM | Updated on Nov 27 2026 4:14 AM

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

సూర్యాపేటటౌన్‌ : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగిన నాటుసారా తయారీ, విక్రయాలకు కొన్నేళ్ల క్రితం పూర్తిగా అడ్డుకట్ట పడింది. దాంతో గుడుంబా ఆనవాళ్లు కనుమరుగయ్యాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ పల్లెల్లో సారా బట్టీలు పుట్టుకొస్తున్నాయి. రహస్య ప్రాంతాల్లో బట్టీలు ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. పోలీసుల వరుస దాడుల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

నవంబర్‌లో 52 కేసులు

జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలకు సంబంధించి నవంబర్‌ నెలలోనే 52 కేసులు నమోదయ్యాయి. ఇందులో 52 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. పోలీసుల దాడుల్లో సుమారు 166 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 25 కిలోల బెల్లం, 5 కిలోల పటిక, 150 లీటర్ల బెల్లం పానకాన్ని పట్టుకున్నారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు.

ఆంధ్రా నుంచి సరఫరా..

నాటుసారా తయారీకి అవసరమైన నల్లబెల్లం, పటిక ఇతర ముడి సరుకులు ఆంధ్రా ప్రాంతం నుంచి జిల్లా లోని ప్రధాన పట్టణాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వీటిని తరలించి, రహస్యంగా సారా తయారు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో కొందరు ఈ అక్రమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామాల శివారు ప్రాంతాలు, వ్యవసాయ బావుల వద్ద, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో బట్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల దాడుల్లో బయటపడింది.

15 మండలాల్లో అత్యధికంగా..

జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్‌, పాలకవీడు, మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెర్వు, నూతనకల్‌, అర్వపల్లి, మద్దిరాల, మోతె, ఆత్మకూర్‌.ఎస్‌, తుంగతుర్తి, తిరుమలగిరి, అనంతగిరి, పెన్‌పహాడ్‌ మండలాల్లో నాటు సారా తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఆయా మండలాల్లోని తండాలు, మారుమూల గ్రామాల్లో బట్టీలు ఏర్పాటు చేసి సారాను తయారు చేసి ప్యాకెట్లలో నింపి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. వాటిని కార్మికులు, ఇతర వర్గాల వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నల్లబెల్లంతో పాటు తెల్లబెల్లం, పండ్లతో కూడా సారాను తయారు చేస్తున్నట్లు సమాచారం.

ఆరోగ్యానికి ముప్పు..

గుడుంబా తయారు చేసే సమయంలో ఇష్టారీతిగా, ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నట్లు తెలిసింది. దాంతో ఈ సారా తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయినా కొందరు తక్కువ ధరకు లభిస్తుందని నాటుసారాకు అలవాటు పడుతున్నారు. నాటుసారా వల్ల యువత, కూలీలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, విక్రయాలపై పోలీసులు నిరంతర నిఘా పెట్టడంతో పాటు, దీని వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే ఈ అక్రమ వ్యాపారానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

ఒక్కరోజే 28 కేసులు

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలోని మఠంపల్లి, గరిడేపల్లి, మేళ్లచెరువు, పాలకీడు, చింతలపాలెం గ్రామాల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎకై ్సజ్‌ అధికారులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఇందులో 35 కిలోల పటిక, 40 కిలోల బెల్లం, 55 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2,900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 28 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్టు చేశారు. మరో 10 మందిని బైండోవర్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఈ ఏడాది ఎకై ్సజ్‌ శాఖ దాడుల్లో..

పట్టబడిన సరుకు

బెల్లం పానకం : 56,590 లీటర్లు

బెల్లం : 14,038 కిలోలు

పటిక : 1,283 కిలోలు

నమోదైన కేసులు : 976

బైండోవర్‌

ఉల్లంఘించిన కేసులు : 27

నవంబర్‌లో పోలీసుల దాడుల్లో..

నమోదైన కేసులు : 52

సీజ్‌చేసిన సారా : 166 లీటర్లు

పట్టుబడిన బెల్లం : 25 కిలోలు

పటిక : 05 కిలోలు

బెల్లం పానకం : 150 లీటర్లు

తండాలు, పల్లెల్లో యథేచ్ఛగా సారా తయారీ

ఆంధ్రా నుంచి బెల్లం, పటిక రవాణా

సూర్యాపేటలోనూ నాటుసారా

విక్రయాలు

వరుస దాడులతో పోలీసుల ఉక్కుపాదం

ఒక్క నెలలోనే 52 కేసులు

నాటు సారా తయారీపై జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో వారం రోజుల పాటు దాడులు నిర్వహించాం. పలు గ్రామాల్లో బట్టీలు ఏర్పాటు చేసి సారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేశాం. నాటు సారాను తయారు చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. సారా వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కసారి దొరికిన తర్వాత మళ్లీ అదే పనిచేస్తే బైండోవర్‌ కేసు నమోదు చేస్తాం.

– కె.నరసింహ, ఎస్పీ, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement