బీమాకు సాంకేతిక అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

బీమాకు సాంకేతిక అడ్డంకులు

Nov 27 2026 4:14 AM | Updated on Nov 27 2026 4:14 AM

భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తు ప్రక్రియలో అర్హులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన విధానానికి.. క్షేత్రస్థాయి అమలులో కొంత వ్యత్యాసం ఉండడంతో ఆన్‌లైన్‌ నమోదు సమయంలో కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రధానంగా రేషన్‌ కార్డుల్లో పేర్లున్న వారికే ఈ పథకం వర్తిస్తుండగా.. ఒంటరిగా ఉన్న వారు పథకానికి దూరం కావాల్సి వస్తోంది. దాంతో పాటు పలుచోట్ల సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈనెల 19న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

అందరికీ బీమా అంటూ..!

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా ఉంటుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమలుకు నోచుకోవడం లేదు. రేషన్‌ కార్డు ఆధారంగా పోర్టల్‌లో దరఖాస్తు ఓపెన్‌ అవుతుండగా.. వివరాలను నమోదు చేస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల లోపు రేషన్‌ కార్డులో ఉన్న వారి పేర్లు మాత్రమే కనిపిన్నాయి. అందులో ఒకరి పేరున బీమా.. మరొకరి పేరును నామినీగా నమోదు చేసుకునే అవకాశం ఉంటున్నది. వయస్సు 59 ఏళ్లు దాటి వారి పేరును పోర్టల్‌ స్వీకరించడం లేదు. దాంతో పాటు రేషన్‌ కార్డులేని వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారన్నది స్పష్టత లేకపోవడంతో వారికి నిరాశే ఎదురవుతోంది.

ఒంటరిగా ఉంటే అంతే..

కుమారులు, కుమార్తెలు ఉన్నప్పటికీ ఒంటరిగా రేషన్‌ కార్డు ఉన్నవారు మాత్రం జీవిత బీమాకు నోచుకోవడం లేదు. ప్రధానంగా నామినీల వివరాలను రేషన్‌ కార్డుల్లో ఉన్నవారికే నమోదు చేయాల్సి రావడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లు ఉండి అందులో ఒకరు మైనర్‌ అయినా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మైనర్‌ను నామినీగా చేర్చాలంటే ఆమెకు తోడుగా అదనంగా గార్డియన్‌ పేరు నమోదు చేయాల్సి ఉంది. ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేని వారంతా గంటల తరబడి నమోదు కేంద్రాల వద్ద ఉండి వెనుతిరగాల్సి వస్తోంది.

రేషన్‌కార్డు ఉంటేనే ఇందిరమ్మ బీమా

ఒంటరిగా ఉన్నవారికి అందని పథకం

59 ఏళ్లు దాటిన వారికి బీమాకు, నామినీలుగా ఉండేందుకు నో చాన్స్‌

గ్రామస్థాయిలో నెమ్మదిగా సాగుతున్న దరఖాస్తుల నమోదు

సంతకం చేస్తేనే నమోదు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ కావాల్సి ఉంటుంది. వీటిని తీసుకొని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళితే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. బీమా చేయించుకోవాలంటే రేషన్‌ కార్డులో ఉన్న వారిలో ఒకరు హాజరై తమ సంతకం చేయాల్సి ఉంది. ఈ విధానంతో ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉండే వారికి ఇబ్బందులు ఎదురవుతోంది. దరఖాస్తు ప్రక్రియ సైతం నెమ్మదిగా సాగుతోంది. దరఖాస్తు అనంతరం బీమా చేసుకున్న వారికి రసీదు ఇవ్వాల్సి ఉన్నా.. ప్రింటర్‌ సౌకర్యం లేకపోవడంతో ఇవ్వడం లేదు. ఫోన్‌కు వచ్చే లింక్‌ ద్వారా రశీదు పొందవచ్చని సిబ్బంది చెబుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంత నిరక్ష్యరాస్యులతో పాటు స్మార్ట్‌ఫోన్‌ లేని వారికి రశీదు కష్టంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement