మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు.
శివాలయంలో పూజలు
మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వరునికి కార్తీక మాస పూజలను గురువారం తెల్లవారు జామున చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణను దరఖాస్తులు
సూర్యాపేట: గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు చదువు మధ్యలో ఆపేసిన గిరిజన యువతీ యువకులు ఇందుకు అర్హులని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పిగ్లీపూర్ (కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ వద్ద) కేంద్రంలో 3 నుంచి 6 నెలల పాటు ఉచిత భోజనం, వసతితో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాల, వివరాలకు 93900 62835 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
దేవరకొండకు ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు
సూర్యాపేట(భానుపురి): ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 27 నుంచి సూర్యాపేట నుంచి దేవరకొండకు నేరుగా రెండు ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సులను నడుపనున్నట్లు డిపో మేనేజర్ వి. సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు బస్సులు మొత్తం నాలుగు ట్రిప్పులు నడుస్తాయని, నకిరేకల్, నల్లగొండ మీదుగా దేవరకొండకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.
అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా రమేష్
నల్లగొండటూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా రసాయన శాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ దోమల రమేష్ నియామకమయ్యారు. గురువారం ఎంజీయూ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అంజిరెడ్డి పాల్గొన్నారు.


