ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టొద్దు
సూర్యాపేటటౌన్ : ప్రజలను వివిధ అంశాలపై ఆశ పెడుతూ సైబర్ నేరగాళ్లు వారిని మోసం చేస్తున్నారు. తక్కువ సమయంలో భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి ప్రజల ఖాతాల్లోని డబ్బును కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లు, షేర్ మార్కెట్ ట్రేడింగ్, అధిక లాభాల పేరుతో సైబర్ మోసగాళ్లు విసురుతున్న వలలో పలువురు చిక్కుకుంటున్నారు. అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టి లక్షలు పోగొట్టుకున్న బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది.
పెరుగుతున్న కేసులు
ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ద్వారా 939 సైబర్ నేర కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు మొత్తం రూ.3,58,01,222 కోల్పోయారు. సైబర్ నేరాలపై సకాలంలో స్పందిస్తున్న పోలీసులు ఇప్పటివరకు రూ. 1,03,81,060ను ఫ్రీజ్ చేశారు. ఇందులో రూ.23,13,450ను బాధితులకు రీఫండ్ చేశారు.
వాట్సప్ ద్వారా లింకులు
మొబైల్ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పి మొదట కొంత మొత్తానికి లాభాలు చూపిస్తారు. వారికి నమ్మకం పెరిగిన తర్వాత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించి, చివరకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. డబ్బు విత్‌డ్రా చేసుకునే సమయంలో అదనపు రుసుములు, పన్నులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మరింత డబ్బు వసూలు చేస్తున్నారు. తక్కువ సమయంలో రెట్టింపు లాభం, రోజుకు వేల రూపాయల ఆదాయం, గ్యారంటీడ్ రిటర్స్‌న్స్ వంటి మాటలకు ఆకర్షితులై పెట్టుబడులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వెంటనే ఫిర్యాదు చేస్తేనే ఫలితం
సైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌న్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేయడం, లేదా నగదుగా మార్చుకోవడంతో తిరిగి రాబట్టడం మరింత కష్టమవుతుంది.
పెరుగుతున్న సైబర్ మోసాలు
ఫ ఈ ఏడాది 939 కేసులు.. రూ.3.58 కోట్ల మోసం
ఫ రూ.1.03 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు
ఫ రూ.23.13 లక్షలు బాధితులకు రిఫండ్
ఫ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లను
నమ్మొద్దంటున్న పోలీసులు
సూర్యాపేట మండలానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇటీవల వాట్సప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో లింక్ వచ్చింది. అతను ఆ లింక్‌ను ఓపెన్ చేయగానే ట్రేడింగ్ యాప్ తరహాలో కనిపించే ప్లాట్‌ఫామ్ ప్రత్యక్షమైంది. అందులో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే భారీగా లాభాలు వస్తాయని చూపించారు. దాంతో మొదటగా రూ. 5, 10వేలు పెట్టుబడి పెట్టాడు. కొద్దిసేపటికే యాప్‌లో రూ. 20 వేలు క్రెడిట్ అయినట్లు కనిపించింది. దాంతో యాప్‌ను నమ్మిన అతను దశలవారీగా రూ. 21 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. భారీ మొత్తం జమ చేసిన వెంటనే సైబర్ మోసగాళ్లు అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. గుర్తుతెలియని వ్యక్తుల హామీలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండటమే సైబర్ మోసాల నుంచి రక్షణకు ప్రధాన మార్గం. సైబర్ మోసానికి గురైతె వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. లోన్‌యాప్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లకు స్పందించవద్దు.
–వెంకటయ్య, సైబర్ క్రైం డీఎస్పీ, సూర్యాపేట


