కోదాడ: కోదాడలో పోలీస్‌రాజ్యం నడుస్తుందని, సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. రాజకీయ కక్షతో నిరుపేదరాలి డబ్బాకొట్టును అక్రమంగా తొలగించారని, ప్రశ్నించిన వారిపై పట్టణ సీఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే పార్టీ నాయకులతో కలిసి మల్లయ్యయాదవ్ మోటార్ సైకిల్‌పై తిరుగుతూ దుకాణాలను బంద్ చేయించారు. మధ్యాహ్నం 11 గంటల వరకు దుకాణాలు మూసి వేసినప్పటికీ ఆ తరువాత వ్యాపారస్తులు వాటిని తెరిచారు. పాఠశాలలు, కళాశాలలు ముందస్తుగా సెలవులు ప్రకటించాయి. ఈ సదర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడలో పోలీస్ అధికారుల వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని, పేదలను వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకొనే వరకు ఉద్యమం ఆగదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎస్‌కే.నయీం, తుమ్మలపల్లి భాస్కర్, చీమ నరేష్, నల్లా భూపాల్‌రెడ్డి, బట్టు శివాజీ, కరీముల్లా బాబా, సంగిశెట్టి గోపాల్, బత్తుల ఉపేందర్, గట్ల కోటేశ్వరరావు, సంపెట ఉపేందర్, అబ్బు, మర్ల వీరబాబు, కాసాని మల్లయ్యగౌడ్ వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ బంద్


