మబ్బులే.. చినుకు కురువలే.. | - | Sakshi
Sakshi News home page

మబ్బులే.. చినుకు కురువలే..

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాపై వరుణుడు కరుణ చూపడం లేదు. ఎల్‌నినో పరిస్థితులతో తీవ్ర వర్షాభావం నెలకొంది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉన్నా.. చినుకు జాడ మాత్రం లేకుండా పోయింది. జిల్లాలోని ఒక్క మండలంలోనూ మోస్తరు వర్షం పడిన దాఖలాలు లేవు. వానకాలం సీజన్‌ ప్రారంభం నుంచి నేటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో రోజు రోజుకు చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గి పోతోంది. ఇప్పటి వరకు 422.4 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 279.8 మి.మీ మాత్రమే కురిసింది. వర్షాన్ని నమ్ముకొని వరి సాగు చేసిన రైతులు ఇప్పటి వరకు చెరువుల్లోకి చుక్క నీరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

చినుకులే దిక్కు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో మోస్తరు వర్షాలు పడిన దాఖలాలు లేవు. రెండు రోజుల క్రితం ఎండ తీవ్రత పెరిగి వేసవిని తలపించడంతో రైతులు ఆందోళన చెందారు. ఇంతలో వాతావరణంలో మార్పులు సంభవించాయి. మబ్బులు పట్టి వాతావరణం చల్లబడింది. దాంతో ఒక్క వర్షమైనా రాకుండా పోతుందా.. చెరువులు, కుంటల్లోకి కొద్ది మేర అయినా నీరు చేరక పోతాయా అని రైతులు అత్రుతగా ఎదురు చూశారు. ఆదివారం రోజంతా చల్లబడి ఉన్నప్పటికీ అక్కడక్కడా చినుకులు తప్ప మోస్తరు వర్షమైనా కురవలేదు. సోమవారం కూడా చినుకులే తప్ప వరుణ దేవుడు కరుణించలేదు.

లోటు వర్షపాతమే

వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో 422.4 మిల్లీ మీటర్ల వర్షాపాతం కురవాల్సి ఉండగా 279.8 మి.మీ వర్షపాతమే నమోదైంది. కేవలం తుంగతుర్తి, ఆత్మకూర్‌ (ఎస్‌), మోతె, మఠంపల్లి మండలాల్లో మాత్రమే ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కురిసింది. మిగతా 19 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం నమోదైన నాలుగు మండలాల్లోనూ మోస్తరుకు మించి వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దాంతో జిల్లా వ్యాప్తంగా 1,100కి పైగా చెరువుల్లో నీటిమట్టాలు తగ్గిపోయి అడుగంటుతున్నాయి.

కురవాల్సింది 422.4 మి.మీ.. కురిసింది 279.8 మి.మీ

ఆకాశం మేఘావృతమైనా..

కురవని వర్షాలు

జిల్లాలోని 19 మండలాల్లో

తీవ్ర లోటు వర్షపాతం

అడుగంటుతున్న చెరువులు..

ఆందోళనలో రైతులు

ఆందోళనలో రైతాంగం

నైరుతి ప్రారంభం నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా తుపాన్‌ ప్రభావంతోనైనా వర్షాలు కురుస్తాయని భావించిన రైతాంగానికి నిరాళే మిగిలింది. నైరుతి సీజన్‌ ముగిసే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు వర్షాలు కురుస్తాయా.. చెరువుల్లోకి కొద్దిమేర అయినా నీరు వస్తుందా.. లేదా అనే అయోమయంలో రైతులు ఉన్నారు. చెరువుల్లో సగంమేర నీరు వచ్చి చేరినా.. వానాకాలం సీజన్‌లో సాగు చేసిన వరి పొలాలు చేతికి వస్తాయని, లేదంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement