భానుపురి(సూర్యాపేట) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనతోనే ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేదలు ఇబ్బంది పడ్డారన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పౌరసరఫరాల శాఖను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి
హుజూర్‌నగర్ : ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు. గురువారం హుజూర్‌నగర్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో నాగార్జున సాగర్ నిండలేదని, రాష్ట్రంలో 31 శాతం వర్షాలు తక్కువగా పడి తీవ్ర వర్షాభావం కొనసాగుతోందన్నారు. ఈ నేపథ్యలో రైతులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంటలు వేసుకోవాలన్నారు. హుజూర్‌నగర్‌లోని మోడల్ కాలనీని సెప్టెంబర్‌లో ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల కేటాయిస్తామన్నారు. అనంతరం ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కొణతం వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్, రాష్ట్ర పెరక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్‌పర్సన్ డి.రాధిక, ఏఎంసీ మాజీ చైర్మన్‌లు సాముల శివారెడ్డి, యరగాని నాగన్న గౌడ్, ఆర్‌డీఓ శ్రీనివాసులు, కౌన్సిలర్ కోతి సంపత్‌రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, రామరాజు, గురవయ్య, ముక్కంటి, నాగేందర్, అమర్‌నాధ్‌రెడ్డి, అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


