ఉపాధికి అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి అడ్డంకులు

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

పెన్‌డౌన్‌లో వీబీజీ రామ్‌జీ ఉద్యోగులు

భానుపురి (సూర్యాపేట) : వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ (వీబీజీరామ్‌జీ) పథకం సిబ్బంది పెన్‌డౌన్‌ సమ్మెతో గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి. తమకు ఉద్యోగ భద్రతతో పాటు పలు సమస్యల పరిష్కారానికి ఫీల్డ్‌ అసిస్టెంట్లు మినహా టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఈసీలు, ఏపీఓలు విధులను బహిష్కరిస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద చేపట్టాల్సిన పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ పనులకు వెళ్లలేని కూలీలకు ఉపాధి కరువైంది. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు కూడా పడడం లేదు.

జిల్లాలో 152 మంది సిబ్బంది..!

సూర్యాపేట జిల్లాలో వీబీజీ రామ్‌జీ పథకం కింద ఏపీఓ, టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, పీఓలు ఇలా సుమారు 152 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా ఉద్యోగ భద్రతతో పాటు 60 రకాల డిమాండ్ల సాధనకు జూలై 31 నుంచి పెన్‌డౌన్‌ చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించలేని పరిస్థితి. ప్రధానంగా కంప్యూటర్‌ ఆపరేటర్లు నమోదు చేయనిదే వర్క్‌ డిమాండ్‌ ముందుకు సాగదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు పనులు చేయలేకపోతున్నారు. ఒకవేళ పనులు కల్పించినా వేతనాలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు.

జలసిరి పనులకూ అంతరాయం

ఎల్‌నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. రానున్న రోజుల్లోనూ భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వ్యవసాయ, ఇతర కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలసిరి పనులు చేపట్టాలని నిర్ణయించింది. వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా జిల్లాలోని 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 97వేల ఇంకుడు గుంతలు, 5,750 పాంపాండ్స్‌, 486 ఊట కుంటలు, 972 మ్యాజిక్‌ డ్రైన్లు, 6201 బోర్‌వెల్‌ రీచార్జి యూనిట్లు నిర్మించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే పెద్ద ఎత్తున వీబీజీ రామ్‌జీ పథకం పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు ప్రారంభంలోనే సిబ్బంది పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో జలసిరి కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యానికి అంతరాయం కలుగుతోంది.

కొందరు విరమించినా..!

జిల్లాలో 152 మంది ఉద్యోగులు, సిబ్బందికి గాను రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దాదాపు 95 మంది పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని విరమించారు. ఇంకా 57 మంది సిబ్బంది నిరసన తెలుపుతుండడంతో వీబీజీ రామ్‌జీ పనులు ముందుకు సాగడం లేదు. చాలా మండలాల్లో వర్క్‌ డిమాండ్‌ లేకపోవడంతో కూలీలు పనులకు వెళ్లడం లేదు. ఓ వైపు వ్యవసాయ పనులు దొరక్క .. మరోవైపు ఉపాధి పనులు సైతం లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం అమలైన నాటినుంచి జిల్లాలో 21వేల మంది 1.62 లక్షల పనిదినాలను పొందారు. కొంతమేర రోజువారీ వేతనాల చెల్లింపులు జరిగినా సుమారుగా రూ.36.65 లక్షల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీజీబీ రామ్‌జీ సిబ్బంది పూర్తిస్థాయిలో విధుల్లోకి వస్తేనే బిల్లులు, కూలీలకు ఉపాధి పనులు లభిస్తాయి. కూలీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బంది కోరుకుంటున్నారు.

గ్రామాల్లో నిలిచిపోయిన

ఉపాధి పనులు

తీవ్ర వర్షాభావంతో దొరకని

వ్యవసాయ పనులు

జలసిరి పనులకూ అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement