30 పరీక్ష కేంద్రాలు..
16,178 మంది విద్యార్థులు
నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను మొత్తం జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించారు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌రూం నుంచి అధికారులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు.
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ
ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో 8 నుంచి 10 సీసీ కెమెరాలు ఉండే విధంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. అలాగే పరీక్షలను పర్యవేక్షణకు ప్రతి సెంటర్‌కు సీఎస్, డీఓలతో పాటు జిల్లాలో రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. అదేవిధంగా జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలోని అన్ని జీరాక్స్ కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు మూసి ఉంచాలి. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడొద్దు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగడం నిషేధం.
86 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు
జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 86 ఉన్నాయి. వీటిలో మొత్తం 16,178 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంత్సరం జనరల్ విభాగంలో 6609 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 1579 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 6479 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 1511 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరగనుంది.
పరీక్ష కేంద్రాల వద్ద
పటిష్ట బందోబస్తు
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతుండగా పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన
విద్యాశాఖ అధికారులు
పరీక్ష కేంద్రాల వద్ద
163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు
నిమిషం నిబంధన ఎత్తివేత
పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు నిమిషం నిబంధన ఎత్తివేశారు. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.05గంటల వరకు అధికారులు అనుమతించనున్నారు. విద్యార్థులను ఉద యం 8గంటల నుంచే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45గంటలకల్లా ఓఎంఆర్ షీట్‌పై వివరాలన్నీ సరి చూసుకోవాలి. 9గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. బార్‌కోడ్‌తో ఉన్న 24పేజీల బుక్‌లెట్‌ను విద్యార్థులకు అందజేస్తారు.


