3.20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి
హుజూర్‌నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల లో రాష్ట్ర వ్యాప్తంగా 3.20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వీటి కోసం రూ.5వేల కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న సింగల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హౌసింగ్ విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇళ్ల కాలనీని మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించ బోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామస్వామి గుట్ట వద్ద ఒకే చోట 110 ఎకరాలలో రూ 125 కోట్లతో హౌసింగ్ కాలనీని నిర్మిస్తున్నామని తెలిపారు. కాలనీలో అంతర్గత రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థకు ప్రభుత్వం నుంచి రూ.75కోట్లు మంజూరు చేయించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో హుజూర్‌నగర్ పట్టణంలో ఇళ్లు లేని వారికి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వెయ్యి మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. రెండో విడతలో నియోజక వర్గంలోని పేదలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌పీ కే నరసింహ, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


