సాగు, తాగునీటికి శ్రీశైలమే శరణ్యం!
సాగర్‌కు 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో పాటు హైదరాబాద్ మహానగరానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరిన్ పీడిత పట్టణాలు, గ్రామాలకు తాగునీటికి గాను శ్రీశైలం జలాశయమే శరణ్యమైంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటి వినియోగం అధికంగా జరుగుతుండడంతో నీటిమట్టం వేగంగా తగ్గిపోతోంది. దీంతో ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పాదన ద్వారా వచ్చే నీటితోనే సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కృష్ణానదికి భారీస్థాయిలో వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్కుల వరదనీరు జలాశయాల్లోకి చేరింది. నవంబర్ నెల వరకు శ్రీశైలం, సాగర్ జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. అయితే, గడిచిన 114 రోజుల్లోనే సాగర్ జలాశయం నుంచి 135 టీఎంసీల నీటిని పంటల కోసం వినియోగించారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. మంగళవారం నాటికి నీటిమట్టం 539 అడుగులు (186.6644 టీఎంసీలు) ఉంది.
45 టీఎంసీల నీరు
శ్రీశైలం నుంచి ఇస్తేనే..
సాగర్ ఆయకట్టులో ప్రస్తుతం సాగులో ఉన్న యాసంగి పంట చేతికి రావాలంటే ఏప్రిల్ 7వ తేదీ వరకు అంటే మరో 42 రోజుల వరకు నీటిని విడుదల చేయాలి. నిత్యం పంట కాల్వల ద్వారా 21,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన సుమారు 81 టీఎంసీల నీరు పంటకు అవసరమవుతుంది. ఇది కాకుండా వాతావరణాన్ని బట్టి రోజుకు దాదాపు 240 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి ఆవిరై పోతుంది. కాగా, సాగర్ జలాశయంలో కనిష్ట నీటిమట్టం 510 అడుగులకు పైన ఉన్న నీటినే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే.. 55 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. సాగునీటికి 81 టీఎంసీలు, తాగునీటికి 19టీఎంసీలు మొత్తం 100 టీఎంసీల నీరు అవరమవుతుంది. దీని ప్రకారం 45 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయం నుంచి వస్తేనే వేసవి గండం నుంచి గట్టెక్కుతాం.
తాగు నీటికి
రోజూ 2500 క్యూసెక్కులు
ఏప్రిల్ 7 వరకు పంటలకు నీటిని నిలిపేసినా.. హైదరాబాద్ మహా నగరానికి, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు, పట్టణాలకు జులై వరకు తాగునీరు పంపాల్సి ఉంటుంది. గతంలోనే రోజుకు కనిష్టంగా 2వేల క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు అందిచేవారు. హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణాలు ఏడాదికేడాది విస్తరిస్తుండడంతో నివాసాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రోజుకు 2500 క్యూసెక్కుల మేరనైనా తాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.
శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదనతో సాగర్ జలాశయానికి 10,398 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడివైపు(ఆంధ్రప్రదేశ్) విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 137 క్యూసెక్కులు, ఎడమవైపున గల తెలంగాణ విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 9,021 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి శ్రీశైలం నుండి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం862.90 అడుగులు (114.9952 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి విద్యుదుత్పాదన, కుడి ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 25,123 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
ఫ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి
114 రోజుల్లో 135 టీఎంసీల నీటి వినియోగం
ఫ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన ద్వారా సాగర్‌కు
స్వల్పంగా నీటి విడుదల


