డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం
నల్లగొండ టూటౌన్ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ 2019 –20 నుంచి 2020– 21 బ్యాక్‌లాగ్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సీఓఈ ఉపేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు ఆలస్య రుసుం లేకుండా మార్చి 16వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుంతో 17వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డుభద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు బాధ్యతగా ఉండాలని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎవరూ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలో కోల్పోకూడదనేదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.
దీన్ దయాల్ సిద్ధాంతాలే
బీజేపీకి ప్రేరణాశక్తి
సూర్యాపేట : సూర్యాపేటలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌పై ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ తూటుపల్లి రవికుమార్‌లు పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతాలే బీజేపీకి ప్రేరణాశక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రాంచంద్రయ్య, జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యారెడ్డి, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, కోకన్వీనర్ ఆకుల భిక్షమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు చల్లమల నరసింహ, దోసకాయల ఫణినాయుడు, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
గోదావరి నీటి విడుదల 1750 క్యూసెక్కులకు పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి నీటిని మంగళవారం పెంచారు. నీటిని 1613 క్యూసెక్కుల నుంచి 1750 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా పంటలకు వాడుకోవాలని కోరారు.
పేదల ఇళ్లను కూల్చడం హేయమైన చర్య
చివ్వెంల(సూర్యాపేట) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్య అని గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కోణకంచి వీరభద్రయ్య అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాల క్రితం భూదాన్ భూముల్లో హైకోర్టు ఆర్డర్ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చి వేయడం కోర్టు ధిక్కరణే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. యల్లయ్య, భద్రయ్య, వెంకన్న, లింగయ్య, సునిల్ పాల్గొన్నారు.
డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం


