అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్లి..
హాలియా : ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యమైన వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన ఆమెను.. అప్పు తీసుకున్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేయగా.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా పట్టణంలోని రెడ్డికాలనీలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలు సుంకిరెడ్డి అనసూయమ్మ(65) ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆమె బంధువులు హాలియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాల ఆధారంగా..
అయితే అనసూయమ్మ కూలీ పనులు చేయగా వచ్చిన డబ్బులను హాలియా పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ధనలక్ష్మి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్న చినపాక రాములుకు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన డబ్బులు అడిగేందుకు అనసూయమ్మ ఈ నెల 24న ధనలక్ష్మి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాకుండా ఆమె ఫాస్ట్‌పుడ్ సెంటర్‌లోకి వెళ్లి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన పోలీసులు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు చినపాక రాములును అదుపులోకి తీసుకొని విచారించగా.. తన భార్య ధనలక్ష్మి, పెంపుడు కొడుకు గౌరీ కలిసి అనుసూయమ్మను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. అనసూయమ్మ మెడలోని బంగారు ఆభరణాల కోసం తలపై కొట్టి కత్తిపీటతో ఆమె గొంతుకోసి హత్య చేసి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వెనుక భాగంలో మృతదేహాన్ని పూడ్చినట్లు పోలీసులకు వివరించారు.
మృతదేహానికి పంచనామా..
వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించి తహసీల్దార్ రఘు సమక్షంలో పంచనామా నిర్వహించారు. మృతదేహాం కుళ్లిపోవడంతో డాక్టర్ల సహాయంతో పూడ్చి పెట్టిన చోటే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
హత్యకు గురైన వృద్ధురాలు
ముగ్గురు నిందితుల అరెస్టు


