యాదగిరి క్షేత్రంలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల కోలాహలం నెలకొంది. గణతంత్ర వేడుకలతోపాటు మేడారం జాతరకు వెళ్లి తిరుగ పయనంలో హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల వాసులు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా మారాయి. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలకుపైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీస్వామిని 40వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని, స్వామి వారికి నిత్యాదాయం రూ.50,60,181 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.


