కలుషిత నీరుతాగి పలువురికి అస్వస్థత
మోతె : కలుషిత నీరు తాగి మోతె మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం సోమవారం వెలుగు చూడడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సిరికొండ గ్రామంలోని గుట్ట పక్కన నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా గ్రామస్తులకు తాగునీరు సరఫరా అవుతున్నది. అయితే బోరు నీటిని పైప్‌లైన్ ద్వారా ట్యాంక్‌లోకి పంప్‌చేసి వాటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. అయితే పైప్‌లైన్‌లు సరిగా లేక పోవడంతో తాగునీరు కలుషితమవుతున్నది. కలుషిత నీటిని తాగడంతో మూడు రోజులుగా గ్రామానికి చెందిన సుమారు 20 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారు ప్రస్తుతం వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భవాణి, సిరికొండ పల్లె దవాఖాన డాక్టర్ బిందు తమ సిబ్బందితో కలిసి సోమవారం గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ట్యాంక్ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి సాంపుల్స్‌ను పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పంపినట్లు వైద్యధికారులు తెలిపారు.


