పండుగ పూట.. కూరల మంట
సగమే కొనుగోలు చేస్తున్న వినియోగదారులు
తిరుమలగిరి (తుంగతుర్తి) : కూరగాయల ధరలు తగ్గి నట్టే తగ్గి అమాంతం పెరిగాయి. ఇరవై రోజుల వ్యవధిలోనే 20 నుంచి 30 శాతం రేట్లు పెరిగాయి. తిరుమలగిరి మార్కెట్‌లో ప్రస్తుతం టమాట, ఆలుగడ్డ మినహా మిగతావన్నీ రూ.60 – 80 మధ్య పలుకుతున్నాయి.పెరిగిన ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తగ్గిన దిగుమతి
గతంలో తిరుమలగిరి పరిసర గ్రామాల్లో కూరగాయలు ఎక్కువగా పండించేవారు. వాటిని రైతులు తిరుమలగిరిలోని వారాంతపు సంత, దుకాణాలకు విక్రయించేవారు. కొంతకాలంగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిర్చి, టమాట కర్నూల్ నుంచి, ఇతర కూరగాయలు హైదరాబాద్ నుంచి వస్తుంటాయి. కొంతకాలంగా అక్కడి నుంచి కూడా దిగుమతి పడిపోయింది. ఇదే అదనుగా దళారులు రేట్లను పెంచడం స్థానికంగా ధరలపై ప్రభావం పడింది. దళారులు నుంచి కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారులు కొంత లాభం చూసుకొని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. హోల్‌సేట్ మార్కెట్‌లో కాస్త తక్కువగా ఉన్నా.. రిటైల్, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.
ధరలు పెంచిన కర్రీ పాయింట్‌లు
గతంలో కూరలు ప్యాకెట్ ధర రూ.20 ఉంటే ఇప్పుడు చాలా చోట్ల రూ.30 చేశారు. కొన్ని చోట్ల ఇది రూ.40 కూడా అయింది. గతంలో రూ.15, 20కి లభించే సాంబారు ఇప్పుడు రూ.30కి చేరింది. ఉల్లి, టమాట, అల్లం, వెల్లుల్లి ధరలు బాగా పెరగడంతో పెంచక తప్పలేదని కర్రీ పాయింట్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చి వసతి గృహాల్లో, అద్దెకు ఉంటున్న ఎంతో మందికి కర్రీ పాయింట్లే ఆధారం. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండటంతో జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు.
ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ౖపైపెకి..
ఫ 20 రోజుల్లో 30 శాతం వరకు పెరుగుదల
ఫ ఏది ముట్టుకున్నా కిలో రూ.60 నుంచి రూ.80
ఫ సామాన్య, మధ్య తరగతి ఆందోళన
ధరలు ఇలా..
కూరగాయలు కిలో
మిర్చి 60.00
టమాట 40.00
వంకాయ 40.00
కాకర 60.00
గోరు చిక్కుడు 60.00
బీరకాయ 60.00
క్యారెట్ 80.00
బీట్ రూట్ 80.00
20 రోజుల క్రితం కాకర ధర కిలో రూ.30 నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం రూ.60కి చేరింది. టమాట రూ.25 పలకగా రూ.40కి చేశారు. మిగతా కూరగాయలు కూడా కిలో రూ.60కి పైనే పలుకుతున్నాయి. ఆకుకూరలు సైతం సామన్యుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాలకుర, మెంతికూర, చుక్క కూర.. మూడు కట్టలు రూ.20కి విక్రయిస్తున్నారు. గతంలో రూ.500 తీసుకొని సంతకు వస్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవని, పెరిగిన ధరల వల్ల అందులో సగమే కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నట్లు విని యోగదారులు వాపోతున్నారు.


