యూరియా వాడకం డబుల్!
దమ్ము నుంచే ఇష్టానుసారంగా..
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లా రైతాంగం మోతాదుకు మించి యూరియా వాడుతోంది. వరి ఏపుగా రావడం లేదని చెప్పి కొందరు ఎకరానికి నాలుగు బస్తాల దాకా వాడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అంచనాలు తారుమారై కొరత ఏర్పడుతోంది. రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్ నుంచి సొసైటీల ద్వారా కార్డుల ద్వారా యూరియాను పంపిణీ చేస్తున్నా.. రైతుల్లో మార్పు రావడం లేదు. యాప్‌తోనైనా సమస్య తీరుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
వాడాల్సింది రెండు బస్తాలు
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం 5,94,944 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 4,94,470 ఎకరాల్లో వరి వేశారు. జిల్లా పరిస్థితులు, భూముల తీరును బట్టి ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా వాడాల్సి ఉంది. అదీ కూడా రెండు లేదా మూడు విడతల్లో పంటకు ఇవ్వాలి. మొదటగా నాటు పెట్టిన 15 రోజులకు ఎకరానికి ఒక బస్తా, తిరిగి 45 రోజులకు చిరు పొట్టదశలో ఒకసారి, తర్వాత 15 రోజులకు మరోసారి అందించాలి. లేదంటే 45 రోజులకు ఒకేసారి బస్తా యూరియా ఇచ్చినా సరిపోతుంది. ఈ లెక్కన యూరియాను పంటకు అందిస్తే నత్రజని సకాలంలో సమృద్ధిగా అంది పంట పచ్చగా, ఏపుగా ఉంటుంది.
యాప్ బుకింగ్ ద్వారా రెండు బస్తాలే పంపిణీ
మోతాదుకు మించి యూరియా వాడడంతో అధికారుల అంచనాలు తారుమారు అవుతున్నాయి. యూరియా కొరత ఏర్పడి వానాకాలం రైతులు ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా పాస్ పుస్తకాలున్న రైతులకే ఇస్తున్నారు. అధికంగా యూరియా వాడే రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద యూరియాపొంది.. తిరిగి పీఏసీఎస్‌ల వద్ద మళ్లీ తీసుకుంటున్నారు. ఇలా అధిక బస్తాలను పొంది వరి పంటకు అందిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యాప్ బుకింగ్ విధానం విజయవంతమైతే విచ్చలవిడిగా యూరియా వాడకానికి చెక్ పెట్టినట్లు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వరి తొందరగా పచ్చపడాలని కొందరు రైతులు దమ్ములోనే ఎకరానికి అర బస్తా వరకు యూరియా చల్లుతున్నారు. తదనంతరం 15 రోజులకు రెండు బస్తాల లెక్కన వేస్తున్నారు. అయితే చలికాలంలో వరి అంతగా పెరగదు. అగ్గి తెగులుకూ అవకాశం ఉంటుంది. జింక్ లోపం తలెత్తుతోంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా నివారణ చర్యలు తీసుకోకుండానే వరి పైరు పెరగడం లేదని యూరియాను మోతాదుకు మించి వాడుతుంటారు. రెండోదఫాలోనూ ఇదే విధంగా ఎకరానికి రెండు బస్తాల యూరియాను వినియోగిస్తున్నారు.
మోతాదుకు మించి వినియోగిస్తున్న రైతులు
ఫ ఎకరానికి నాలుగు బస్తాలకు పైనే..
ఫ కార్డులు ఇచ్చినా అంతే..
ఫ యాప్ ద్వారా బుకింగ్ విధానంతోనైనా అడ్డుకట్ట పడేనా..
జిల్లాలో యూరియా కొరత లేదు. వరి పంటకు మోతా దుకు మించి యూరియా వాడొద్దు. ఇలా వాడితే రైతులే నష్టపోతారు. రానున్న రోజుల్లో భూమిసారం కోల్పోతుంది. పంటలకు చీడపీడలు ఆశించి దిగుబడి తగ్గుతుంది. పెట్టుబడులు పెరుగుతాయి. వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు మాత్రమే యూరియా వాడాలి.
–శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


