కొత్త రేషన్‌ కార్డులివ్వరా ! | Sakshi
Sakshi News home page

కొత్త రేషన్‌ కార్డులివ్వరా !

Published Tue, Mar 14 2023 5:58 AM

- - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆహార భద్రత కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతున్నా.. ఏడాదిన్నర కాలంగా కొత్త కార్డులను మంజూరు చేయడం లేదు. 2021 జూలైలో పెండింగ్‌లో ఉన్న నూతన కార్డులను జారీ చేశారు. మళ్లీ ఏడాదిన్నర పూర్తయినా నూతన కార్డులు మంజూరు కావడం లేదు. పైగా జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కార్డుల్లో మార్పులు, చేర్పుల (మ్యూటేషన్ల)కు మోక్షం కలగడం లేదు. ఫలితంగా అర్హులైన పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతుతున్నారు. వేలాది మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు
కొత్త రేషనన్‌ కార్డులు, పాత వాటిల్లో చేర్పులు, మార్పుల కోసం చాలా మంది ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పరిశీలించి జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి లాగిన్‌న్‌కు పంపించారు. ఇక్కడ వాటిని పరిశీలించిన అధికారులు మంజూరు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఏడాదిన్నర నుంచి లాగిన్‌ తెరుచుకోకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వాళ్లు కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా పాత కార్డులోంచి వారి పేరును తొలగిస్తేనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా చాలామంది కొత్తకార్డుల కోసం ఉమ్మడి కుటుంబం కార్డుల నుంచి పేర్లను తొలగించుకొని నూతన కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు.

కానీ, వారందరికీ కార్డులు మంజూరు కావపోవడంతో వారి పరిస్థితి రెంటింకి చెడ్డ రేవడిలా మారింది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వచ్చిన వారు కూడా కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కావడం లేదు. 2018 డిసెంబర్‌ ఎన్నికలు జరిగే వరకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరాయంగా సాగించింది. ఆ తరువాత 2021 జూలై మాసంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నూతన రేషన్‌ కార్డుల దరఖాస్తులకు మోక్షం కలిగింది. జిల్లాలో సుమారు 12 వేల నూతన కార్డులు మంజూరయ్యాయి. కానీ, పేర్ల మార్పులు– చేర్పులు (మ్యూటేషన్ల)పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన అర్జీలకూ మోక్షం లేదు.

దరఖాస్తుల వివరాలు..

కొత్తకార్డుల కోసం అర్జీలు 25,179

మ్యూటేషన్‌ కోసం 46,354

మొత్తం పెండింగ్‌ 71,533

ఆరోగ్య సేవలకు దూరం..

రేషన్‌్‌ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందుతుండగా, కార్డులు లేని వారు నిర్ణీతీ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఏడాదికి సుమారు రూ.2లక్షల విలువైన సేవలు పొందలేక పోతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు నిర్ణీత ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ, కొత్త కార్డులు రాక పోవడంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇలా మరెన్నో ప్రభుత్వ, ప్రైవేట్‌ పథకాలకు పేదలు దూరమవుతున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియను నిరంతరం జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని పేదులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement