మంత్రి ఉత్తమ్‌ను కలిసిన నూతన కౌన్సిలర్లు | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఉత్తమ్‌ను కలిసిన నూతన కౌన్సిలర్లు

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

మంత్రి ఉత్తమ్‌ను కలిసిన నూతన కౌన్సిలర్లు

మంత్రి ఉత్తమ్‌ను కలిసిన నూతన కౌన్సిలర్లు

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నూతన కౌన్సిలర్లు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల విషయమై నూతన కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్‌

ఉల్లంఘించొద్దు : ఎస్పీ

సూర్యాపేట టౌన్‌ : మున్సిపల్‌ చైర్మన్లు ఎన్నికయ్యే వరకు ఈ నెల 16న ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని, కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులు కోడ్‌ ఉల్లంఘించకుండా బాధ్యతగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. వార్డుల్లో ఎవరు కూ డా గొడవలు పెట్టుకోకూడదని, తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేశారు. మహా యజ్ఞంలా సాగిన మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో విధులు నిర్వహించిన ప్రతి పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం జరిపి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తర్వాత నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.

యూరియాను నేరుగా పంపిణీ చేయాలి

చిలుకూరు : ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా కాకుండా రైతులకు యూరియాను నేరుగా పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. శుక్రవారం చిలుకూరు మండలం బేతవోలులో కనకదుర్గమ్మ జాతరకు హాజరైన ఆయన తిరుగుపయనంలో చిలుకూరులో విలేకరులతో మాట్లాడారు. యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల వేల రూపాయాలు పెట్టుబడుతు పెట్టి సాగుచేస్తున్న వరిపొలాలు ఎర్రబారి దెబ్బ తింటున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా యాప్‌ను తొలగించి రైతుల కు నేరుగా అవసరం మేరకు అందించాలన్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శులు మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్‌అలీ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement