● ఆదిత్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడంలో జాప్యం
● పర్సంటేజ్ కోసం కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్న కార్యాలయ సిబ్బంది
మామూళ్ల మత్తులో సిబ్బంది
ఆలయంలో ఓ ఉద్యోగి రిటైర్ అవుతున్నారంటే నిబంధనల ప్రకారం మూడు నెలల ముందే నోటీసును జారీ చేస్తారు. అయితే అదే సమయంలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌తో పాటు గ్రూప్ గ్యాట్యుటీ కింద సదరు జీవిత బీమా కంపెనీకి కూడా ఆలయ అధికారులు నోటీసు లేఖ పంపించి సదరు రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్‌మెంట్ చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. అలాగే బడ్జెట్‌లో కూడా అంచనాగా రిటైర్డ్ ఉద్యోగుల చెల్లింపులకు కావాల్సిన మొత్తాన్ని సదరు హెడ్‌లో చేర్చుతూ ఆమోదించుకోవాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్‌లో శాంక్షన్ లేదంటూ బాధిత విశ్రాంత ఉద్యోగులకు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ కొందరు రెగ్యులర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ స్వలాభం కోసం చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి. గత ఏడాది ఆగస్టులో అటెండర్‌గా రిటైర్ అయిన గన్నెమ్మకు అలాగే ఈ ఏడాది జూన్ నెలాఖరుకు రిటైరైన రికార్డు అసిస్టెంట్ శిమ్మ మల్లేశ్వరరావు తదితరులకు ఇలాంటి చెల్లింపులు రిటైర్ అయిన రోజున జరగలేదు. అయితే గన్నెమ్మకు తర్వాత కొంత కాలానికి గ్రాట్యుటీ కింద రూ.8 లక్షల వరకు జమ చేశారు. కానీ మల్లేశ్వరరావుకు గ్రాట్యుటీ గానీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ గానీ ఏవీ ఇంతవరకు ఇవ్వలేదు. కేవలం మామూళ్ల కోసం ఆశ పడి వీరికి రావాల్సిన మొత్తాలను జాప్యం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఓ రిటైర్డ్ ఉద్యోగిని రూ.25 వేల వరకు చెల్లించేసినట్లుగా సమాచారం. ఇక ఉన్నతాధికారికి ఈ వ్యవహారాలు తెలిసి కూడా పెద్దగా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అరసవల్లి:
‘ఈ మధ్య అరసవల్లి ఆలయంలో సిబ్బందికి ప్రతి పనికి డబ్బులు అలవాటయ్యాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా డబ్బులకు అలవాటు పడ్డారు. అందుకే మనకు ఇంకా బెనిఫిట్స్ రావడం లేదు’
ఓ ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల మధ్య సాగిన సంభాషణ ఇది. జిల్లా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఇది చర్చనీయాంశమైంది.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో దశాబ్దాలుగా సేవ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు నేటికీ రూపాయి బెనిఫిట్ కూడా అందక సదరు రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆలయంలో పనిచేసిన ఉద్యోగులకు ఎలాంటి ఫింఛన్ సౌకర్యం ఉండదు. దీంతో రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ మీదనే విశ్రాంత ఉద్యోగుల జీవనాధారం ఆధారపడి ఉంది. అలాంటి కీలకమైన బెనిఫిట్స్‌ను సకాలంలో అందివ్వడంలో ఆలయ కీలక ఉద్యోగులు అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత ఏడాదిలో రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ అందకపోగా.. ఈ ఏడాది జూన్‌లో రిటైర్ అయిన ఉద్యోగికి అయితే ఒక్క పైసా కూడా ఆలయం నుంచి చెల్లింపు జరగలేదు. నిజానికి ఉద్యోగ విరమణ చేసిన నాటికే గ్రూప్ గ్రాట్యుటీ (ఎల్‌ఐసి)తో పాటు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద 120 రోజుల జీతాన్ని ఇచ్చితీరాల్సి ఉంటుంది. రెండేళ్ల నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు.
క్లియర్ చేస్తాం
రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా బెనిఫిట్స్ అందని మాట వాస్తవమే. అయితే వాటి పరిస్థితులను పరిశీలించి త్వరగానే క్లియర్ చేస్తాం. కార్యాలయంలో డబ్బులు వసూళ్లపై సమాచారం లేదు.
– కేఎన్‌వీడీవీ ప్రసాద్, ఈఓ


